Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక అండలేకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచిన వ్యక్తి
- సంతాపసభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు
- ఆమె స్ఫూర్తితో పోరాటాలు : ఎస్.వీరయ్య
- ప్రజా, కార్మిక ఉద్యమాలకే పర్సా దంపతుల జీవితం అంకితం : ఎస్వీ రమ
- సీఐటీయూ కార్యాలయంలో నేతల నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక, ప్రజా ఉద్యమాల్లో పర్సా సత్యనారాయణకు తుదివరకూ అండగా నిలిచిన ఆయన సతీమణి పర్సాభారతిది భావాలకు అందని గొప్ప త్యాగమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు స్మరించుకున్నారు. ఆమె మరణం తీరని లోటు అని అన్నారు. భర్త నిత్యం జైలు, రహస్య, నిర్బంధ జీవితాన్ని గడిపే సమయంలోనూ ఆర్థిక అండదండలు లేకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం అష్టకష్టాలు పడి కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఘనత ఆమెదని గుర్తుచేశారు. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో పర్సాభారతి సంతాప సభను ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పి.రాజారావు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య పూలమాలలు వేసి, మిగతా నేతలు పూలు చల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1945లో పర్సాసత్సనారాయణతో భారతి పెండ్లి అయిందనీ, కొద్దిరోజులకే భర్త జైలుకెళ్లారనీ, ఆ తర్వాత కూడా 1962, 1964లోనూ పలుమార్లు జైలు జీవితాన్ని గడిపారన్నారు. సింగరేణిలో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా, కార్మిక పోరాటాల్లో పర్సా సత్యనారాయణ చురుగ్గా పాల్గొనేవారన్నారు. పోరాటాలంటూ ఊర్లు తిరిగే భర్త ఇంటికెప్పుడొస్తాడో? ఎప్పుడు అరెస్టు అవుతాడో? ఎప్పుడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్తాడో? తెలియని పరిస్థితుల్లోనూ అంకిత భావంతో కుటుంబానికి అండగా నిలిచిన మహనీయురాలని గుర్తుకు చేసుకున్నారు. ఓ మహిళగా ఆమె ఎదుర్కొన్న కష్టాలను చూసే తాను పెండ్లి చేసుకోలేదని చెప్పారు. మహిళా ఉద్యమాల్లోనూ ఆమె పాలుపంచుకున్నారని గుర్తుచేశారు. ఎస్.వీరయ్య మాట్లాడుతూ..ప్రతి పురుషుడి విజయం వెనుక మహిళ ఉంటుందనే లెనిన్ సూక్తికి పర్సా భారతిగారే చక్కటి ఉదహరణని చెప్పారు. పర్సా ప్రతివిజయంలోనూ ఆమె పాత్ర ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో తన చివరిరోజులు గడపాలనే ఆమె కోరిక అలాగే ఉండిపోవడం బాధాకరమన్నారు. తమకు ఆమె ఆదర్శప్రాయులనీ, ఆమె స్ఫూర్తితో పోరాటాలు చేస్తామని చెప్పారు. శ్రామిక మహిళా కన్వీనర్ ఎస్వీ రమ మాట్లాడుతూ..ప్రజా, కార్మిక ఉద్యమాలకు పర్సా దంపతులు తమ జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఎమ్మెల్యే అయినప్పటికీ పర్సా సత్యనారాయణ ఏనాడూ ఆడంబరాలకు పోలేదనీ, సీపీఐ(ఎం) విధానాలకు లోబడి నడుచుకున్నారని కొనియాడారు. భారతి చివరి వరకూ అండగా నిలబడటంతోనే పర్సా తన పోరాటాలను నిర్విరామంగా కొనసాగించగలిగారని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, బి.మధు, ఉపాధ్యక్షులు వీఎస్‌రావు, రాష్ట్ర నాయకులు రమేశ్, సుధాకర్, సోమన్న, వాణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
పర్సా భారతి త్యాగశీలి : బి.వెంకట్
వ్యవసాయ కార్మిక ఉద్యమాలకు పర్సా భారతి తోడ్పాటు నందించారనీ, ఆమె గొప్ప త్యాగశీలి అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పర్సా సత్సనారాయణ కుటుంబంతో తనకు చాలా అనుబంధం ఉందని గుర్తుకుచేసుకున్నారు. ప్రజా, కార్మిక సంఘాల్లో పర్సా దంపతులు పోషించిన పాత్ర మరువలేనిదనీ, నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ నిలిచిన మహనీయులని కొనియాడారు. భారతి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.
పర్సాభారతి మరణం పట్ల ఐద్వా సంతాపం
ఐద్వా సీనియర్ నేత పర్సాభారతి మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటు అని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణజ్యోతి, మల్లు లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతి సుదీర్ఘకాలం మహిళా ఉద్యమాల్లో పనిచేశారనీ, మహిళాభివృద్ధి కోసం తుదిశ్వాస వరకు పనిచేశారని కొనియాడారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.