Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు
- కలెక్టరేట్ల ఎదుట ధర్నా
నవతెలంగాణ -విలేకరులు
వీఆర్ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలపై పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. ర్యాలీలు తీశారు. యాదాద్రి, నల్లగొండ కలెక్టరేట్ల వద్ద ధర్నాలో వంగూరి రాములు పాల్గొని ప్రసంగించారు. 2020 సెప్టెంబర్ 09న శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓలను రద్దు చేసి వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2017 ఫిబ్రవరి 24న వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఐదేండ్లవుతున్నా అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈనెల 22న చలో ఇందిరాపార్క్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చెంద్రారెడ్డి, దాసరి పాండు మద్దతు తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏలు ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అమోరుకుమార్కు వినతిపత్రం అందజేశారు.మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గ్రామ రెవెన్యూ సహాయ సేవకుల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా కార్యదర్శి రామ చంద్రయ్య ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానం నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. ధర్నాకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఏఓ ఎల్లప్పకు వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కు వద్ద ధర్నా చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడా ధర్నా చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ ఏఓ శ్రీనివాసులుకు అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ర్యాలీగా రాజీవ్ చౌక్, బస్టాండ్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నాకు మాజీ మంత్రి చిన్నారెడ్డి మద్దతు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం ధర్నాచౌక్‌లో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానాలు చేశారు. వారికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది.