Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి డివిజన్ బంద్ విజయవంతం
- కదలని ఆర్టీసీ బస్సులు
- అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-భద్రాచలం
ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన భద్రాచలం డివిజన్ బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో నిర్వహించిన ఈ బంద్‌లో ప్రజలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. భద్రాచలం ఆర్టీసీ డిపోలో బస్సులు కదలకుండా అడ్డగించారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు జాతీయ రహదారిపై నాయకులు మూడు గంటల పైగా రాస్తారోకో నిర్వహించారు.
పాలకులు ఇకనైనా కండ్లు తెరవాలి..
పాలకులు ఇకనైనా కండ్లు తెరవాలని, ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఆ ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్ అన్నారు. భద్రాచలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఏపీలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడానికి పార్లమెంట్లో తక్షణమే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరారు. లేకపోతే భద్రాద్రి ప్రజల ఆవేదన దేశ వ్యాప్తంగా వినిపిస్తామని హెచ్చరించారు.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ.. పోలవరం పేరుతో ఏడు మండలాలను అర్ధరాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కలపడం ద్వారా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగ, నాయకులు బండారు శరత్‌బాబు, బి.వెంకట రెడ్డి, వై.వెంకట రామారావు, నాదెళ్ళ లీలావతి, పి.సంతోష్ కుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మళ్ల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అకోజు సునిల్ కుమార్, అఖిలపక్ష నాయకులు బల్లా సాయి కుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు బుడగం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, రంగారావు, తాండ్ర నరసింహారావు, రవికుమార్, నరేష్, టీటీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్ పాల్గొన్నారు.