Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలి
- ఏపీ ఉద్యోగ పోరాట సమితి డిమాండ్
- ఇందిరాపార్క్ వద్ద ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్‌లో నిరుద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మోసం చేశారని ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు విమర్శించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సమితి ఆధ్వర్యంలో 'నిరుద్యోగులను మోసం చేసిన జగన్, మాకు జాబు రావాలంటే నువ్వు పోవాలి'అంటూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ఏపీ కార్యదర్శి లెనిన్‌బాబు, ఏపీ ఉద్యోగ పోరాట సమితి నాయకులు సిద్ధిక్, పవన్‌కుమార్, సాయి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మనస్థాపం చెంది అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏండ్లకు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే వచ్చే ఎన్నికల్లో జాబ్ రావాలంటే జగన్ పోవాలంటూ నిలదీస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న ఏపీ నిరుద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.