Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు టీఎస్కేఆర్డీఏ ధర్నా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కిరోసిన్ పంపిణీని నిలిపివేయడంతో ఉపాధి కరువై...ఆర్థిక ఇబ్బందులతో పలువురు కిరోసిన్ డీలర్లు మరణించారని తెలంగాణ రాష్ట్ర కిరోసిన్ రిటైల్ డీలర్ల అసోషియేషన్ (టీఎస్కేఆర్డీఏ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మరణించిన కిరోసిన్ డీలర్ల కుటుుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే డిమాండ్‌పై గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎలబోయిన సాంబయ్య, గూడ భద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లుగా కిరోసిన్ పంపిణీ ఆపేసిందనీ, దీంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో వారి కుటుంబాలను పోషించలేకపోతున్నారనీ, మరికొందరు ఉపాధి దెబ్బతినడంతో ఎంతో మంది మరణించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,640 మంది డీలర్లు దీనిపై ఆధారపడి బతుకున్నారని చెప్పారు.
గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేని సమయంలో పేదలకు తాము కిరోసిన్ పంపిణీ చేసేవారమని తెలిపారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తూ...కిరోసిన్ కోటాను పూర్తిగా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను రేషన్‌డీలర్లుగా (7వ తరగతి నుంచి 10వ తరగతి అర్హత) మార్చాలంటూ పౌరసరఫరాల కమిషనర్‌ను కోరినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ విషయాన్ని హైకోర్టు కూడా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు తమకు రేషన్‌షాపులు ఇవ్వలేదనీ, ప్రభుత్వం కనీసం ఆర్థిక సాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఇప్పుడైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలనీ, మరణించిన వారికి తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.