Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎరుపెక్కి ఎండిపోతున్న పైరు
- మందులు పిచికారీ చేసి అలసిపోతున్న రైతన్న
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాసంగిలో సాగు చేసిందే తక్కువ.. అందులోనూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని ప్రకటించడంతో రైతులు వరి సాగు చాలా తక్కువగా సాగు చేశారు. సాగుచేసిన పంటైనా కనీసం బతికి చేతికందుతుందా అంటే.. వింతరోగంతో పైరు ఎరుపెక్కుతోంది. ఎన్నిసార్లు.. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా తెగుళ్లు తగ్గడం లేదు.. పురుగు మందులు పిచికారీ చేసి రైతులే అలసిపోతున్నారు తప్ప పైరు పచ్చపడటం లేదు. శ్రమ.. పెట్టుబడి మట్టిలో పోసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 8,59,777 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో యాదాద్రి జిల్లాలో 1,11,617, సూర్యాపేట 3,94,832 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 3,35,328 ఎకరాలు సాగైంది. సాగైన పంటలో సుమారు 50శాతం సన్న రకాలు.
గత నెలలో కురిసిన ముసురు వర్షం.. చలి గాలుల వల్ల వరి పైరుకు కొత్త రకం తెగుళ్లు సోకినట్టు రైతులు చెబుతున్నారు. పైరు ఎర్రగా మారి ఆ తర్వాత ఎండిపోతుంది. దీనిని రైతులు 'గొట్టంరోగం' తెగులుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యవసాయ అధికారులు మాత్రం నీరు నిల్వ ఉండి, మురుగు నీరు వెళ్లిపోకపోవడంతో అలా మారుతుందంటున్నారు. వానాకాలం పంట తర్వాత ఒకసారి పూర్తిగా ఆరబెట్టాలని ఆ తర్వాత సాగు చేయాలని చెబుతున్నారు. రైతులు పొలం ఆరకముందే తిరిగి సాగు చేయడం వల్లే పైరు ఎర్రగా మారి ఎండుతోందని అంటున్నారు. ఒక రైతు నాలుగు ఎకరాలు సాగు చేస్తే అందులో 50శాతం పైరు ఎర్రగా మారి ఎండిపోతుంది. మూడు నుంచి ఐదుసార్లు అనేక రకాలైన రసాయన మందులు పిచికారీ చేశారు. కానీ ఎలాంటి ఫలితం ఉండటం లేదు.
ఆయకట్టు ప్రాంతంలోనే ఎక్కువ ఇలా..
ఒక సీజన్లో వరి సాగు చేస్తే ముఖ్యంగా వానాకాలంలో పంట సాగు చేసి కోసిన తర్వాత ఆ పొలాన్ని బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత సాంద్రత ఉండేలా ఎరువులు చల్లాల్సిన అవసరం ఉంటుంది. కాల్వల కింద ప్రాంతాల్లో ఎక్కువగా వరి పైరు ఎర్రగా మారి గుంపులు గుంపులుగా ఎండిపోతుంది. దీనికి ప్రధానకారణం భూమిలో నీటి నిల్వ ఉండటమేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో రైతులకు వ్యవసాయ శాఖ నుంచి సరైన సలహాలు, సూచనలు అందడం లేదని తెలుస్తోంది.
క్షేత్రస్థాయి అధికారులు ఎక్కడా...?
ప్రతి 5వేల ఎకరాల సాగుకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి ఉండాల్సి ఉంది. రైతులకు అందుబాటులో ఉంటూ ఆ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడూ వారికి అవగాహన కల్పిస్తూ, పంటకు సోకిన రోగాల నివారణకు తగిన సలహాలు అందించి మందులు వాడేలా రైతులను చైతన్యం చేయాలని ప్రభుత్వం ఏఈవో వ్యవస్థను బలోపేతం చేసింది. కానీ నెల రోజులుగా జిల్లావ్యాప్తంగా వరి పంట పూర్తి ఎర్రగా మారి ఎండిపోతుంటే.. నివారణకు అధికారులు ఎలాంటి సూచలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి ఎర్రగా మారి ఎండిపోతుంది
వరి చేను గుంపులు.. గుంపులుగా ఎర్రగా మారి ఎండిపోతుంది. ఎన్ని రకాల మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయింది. చేసిన శ్రమ, పెట్టిన పెట్టుబడి రెండూ నష్టమే. ఉన్న పొలంలో సగానికి కంటే ఎక్కువగా ఇదే పరిస్థితి.
- కొండేటి ఇద్దయ్య, మామిడాల
సరైన మందులు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది
నీటి నిల్వ ఉండగానే పంట నాటు వేస్తే ఆ తర్వాత వరి పంట ఎర్రగా మారి ఎండిపోతుంది. వాస్తవంగా రైతులు వానాకాలం పంట పొలాన్ని పూర్తిస్తాయిలో ఆరబెట్టాలి. లేకపోతే నష్టం వస్తుంది. దాని ఫలితంగా వరి చేను ఎర్రగా మారిపోయింది. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని మందులు పిచికారీ చేసి పంటను కాపాడుకోవాలి.
- జి. శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నల్లగొండ