Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి చర్యలు
- మహబూబాబాద్‌లో కొత్త మెడికల్ కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-మట్టెవాడ
ఓరుగల్లు నగరాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. గురువారం వరంగల్ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో టీ డయాగ్నోస్టిక్ హబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జీఎంహెచ్‌లో మదర్ మిల్క్ బ్యాంకు, టీబీ స్పెషాలిటీ క్లినిక్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ఎంజీఎం ఆస్పత్రిల్లో 42పడకల పిల్లల కోవిడ్ సంరక్షణ కేంద్రాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరుభాస్కర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఎంజీఎం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యతోపాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓరుగల్లును హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. హెల్త్ సిటీనీ 215ఎకరాల్లో నిర్మించాలని తలపెట్టిన ప్రభుత్వం, అందులో 15 ఎకరాల్లో రూ.1100కోట్లతో భారీ భవన సముదాయాన్ని పాత సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ కట్టబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎంబీబీఎస్‌లో 780సీట్లు మాత్రమే ఉండేవని, వాటిని 2850కి పెంచుకున్నట్టు చెప్పారు. పీజీ సీట్లు 531 మాత్రమే ఉండేవని ఏడేండ్లలో 938కి పెంచామని తెలిపారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెంచుతామన్నారు.
ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని నిటి ఆయోగ్ చెప్పిన్నట్టు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యా, వైద్య రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంటే బీజేపీ అక్కసుతో విషం చిమ్ముతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు క్రియాశీలకంగా ఉండి రాష్ట్ర అవతరణలో ముఖ్య భూమిక పోషించారని, అలా సాధించుకున్న తెలంగాణపై బీజేపీ విషం చిమ్ముతోందని, దీనిపై ప్రజలందరూ తిరగబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ బత్తుల శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరి రమేష్, కలెక్టర్ బి.గోపి, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్, డీఎంహెచ్ఓలు డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.