Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్‌లో జాతీయ రహదారి దిగ్బంధనం
- కేంద్రం నిధులు కేటాయించాలని డిమాండ్
- కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు
- తీవ్రతరమైన సీసీఐ సాధన పోరు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సీసీఐకి కేంద్రం నిధులు కేటాయించి.. పరిశ్రమను పున:ప్రారంభించాలని సీసీఐ సాధన కమిటీ తలపెట్టిన ఉద్యమం తీవ్రతరమవుతోంది. గురువారం జాతీయ రహదారి దిగ్బంధనం విజయవంతమైంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ ఎక్స్‌రోడ్ సమీపంలో నిరసన చేపట్టారు. బీజేపీ మినహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వందల సంఖ్యలో జనాలు రోడ్డుపై బైటాయించడంతో వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధూంధాం కళాకారులతో ఆటపాటలు, కేంద్రం, బీజేపీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. వివిధ గ్రామాల నుంచి భజన కళాకారులు సైతం వచ్చి ఈ నిరసనలో భాగస్వాములయ్యారు.
కేంద్రం స్పందించే వరకు పోరాటం
కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ పరిశ్రమను పున్ణప్రారంభించే వరకు పోరాడుతామని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. సాధన కమిటీ చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీనిచ్చిందని గుర్తుచేశారు. తీరా గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదన్నారు. సీసీఐని పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందని, మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చేతకాకపోతే ఈ పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలన్నా రు. కానీ కేంద్రం ఎటూ తేల్చడం లేదని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ..ఈ ఉద్యమం రాజకీయ పార్టీల మధ్య పోరాటంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మారిందని తెలిపారు.కేంద్రంలో అధికా రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గత ఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ పున:ప్రారంభానికి నిధులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ నాయకులు విజ్జగిరి నారాయణ, మునిగెల నర్సింగ్, నంది రామయ్య, లంక రాఘవులు, బండి దత్తాత్రి, కొండ రమేష్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రి పాల్గొన్నారు. వీరికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు తెలిపారు.