Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంపముంచిన పన్నేతర ఆదాయం
- మొత్తం రూ.30 వేల కోట్లకు.. వచ్చింది రూ.ఐదు వేల కోట్లే
- గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాల అంచనాలూ రివర్స్
- డిసెంబరు వరకు వచ్చిన ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదాయం, రాబడులకు సంబంధించి రాష్ట్ర వెనుకా, ముందూ చూసుకోకుండా వేసుకున్న అంచనాలు తప్పాయి. ఫలితంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి వేసుకున్న అంచనాలు, వాస్తవాలకు పొంతన లేకుండా పోయింది. వీటి మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉండటంతో ఆర్థికశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆదాయ, వ్యయాలకు సంబంధించి ప్రతీయేటా అతి అంచనాలకు పోవటం, ఆ తర్వాత వాటిని సవరించటం సర్కారుకు ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత బడ్జెట్ (2021-22)లో పన్నేతర ఆదాయంపై మొత్తం రూ.30,557 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు అంచనాలేసుకున్నది. అయితే డిసెంబరు 2021 నాటికి ఇందులో కేవలం రూ.5,181 కోట్లే ఖజానాకు చేరాయి. అంటే ఈ రూపంలో రూ.25,376 కోట్లు తగ్గాయన్నమాట. మరో నెలన్నర రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. అప్పటి వరకూ ఇంకో రూ.ఐదు వేల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో వస్తాయని భావించినా... ఇంకా రూ.20 వేల కోట్లు తగ్గినట్టే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాల్లోనూ సర్కారు వేసుకున్న అంచనాలు గాడి తప్పాయి. కేంద్రం నుంచి రూ.38,669 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించి, అందుకనుగుణంగా లెక్కలేసుకుంటే, అక్కడి నుంచి డిసెంబరు నాటికి రూ.6,373 కోట్లే వచ్చాయి. ఇక్కడ కూడా రూ.32,296 కోట్లు తగ్గాయి. 'రాష్ట్ర ప్రభుత్వ అతి అంచనాలు తెలంగాణకు చేటు తెస్తాయి. ప్రతీయేటా రాష్ట్ర బడ్జెట్ కంటే ముందే కేంద్రం తన బడ్జెట్ను ప్రవేశపెడుతున్నది. అప్పుడే ఏయే రాష్ట్రానికి ఏయే రూపాల్లో ఎన్నెన్ని నిధులు వస్తాయనే విషయం తేలిపోతుంది. అది తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులొస్తాయని అంచనా వేసుకోవటం అమాయకత్వం కాకపోతే మరేమిటి...?' అని ఈ సందర్భంగా ఒక అధికారి ప్రశ్నించారు. మొత్తం మీద 2021-22 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ రశీదుల ద్వారా రూ.1.76 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంటే...రూ.86,051 కోట్లే వచ్చాయి. ఇందుకు భిన్నంగా క్యాపిటల్ రశీదులపై వేసుకున్న అంచనాలు చాలా దగ్గరగా వచ్చాయి. ఈ రూపంలో మొత్తం రూ.45,559 కోట్ల రాబడులు వస్తాయని భావిస్తే... రూ.39,069 కోట్లు వచ్చాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) 2021 డిసెంబరు నాటికి విడుదల చేసిన లెక్కలు ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి.
2021 డిసెంబరు నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి... (రూ.కోట్లలో)
అంశం అంచనాలు వాస్తవాలు
వస్తు సేవల పన్ను 35,520 23,413
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 12,500 8,288
భూముల అమ్మకాలు 6.31 0.12
అమ్మకపు పన్ను 26,500 19,875
ఎక్సైజ్ డ్యూటీలు 17,000 13,040
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 8,721 6,236
ఇతర పన్నులు, సుంకాలు 6,652 3,641
పన్నేతర ఆదాయం 30,557 5,181
గ్రాంట్లు, ఇతర సాయాలు 38,669 6,373
లోన్లు, అడ్వాన్సులు 50 36
అప్పులు, రుణాలు 45,509 39,069