Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇల్లందులో కుర్చీ వేసుకుని పట్టాలు ఇస్తామన్నారు..
-ఇన్నేండ్లు సీఎం కేసీఆర్‌కు కుర్చీ దొరకలేదా.. మేమిస్తాం రండి
- బస్సు యాత్ర బహిరంగ సభలో పోడు రైతుల పోరాట కమిటీ నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
''ఎనిమిది సంవత్సరాలుగా అనేక సార్లు అనేక సందర్భాల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిన రాష్ట్రం ప్రభుత్వం మాట తప్పింది.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది.. ఇల్లందుకొచ్చి కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్నారు.. ఏడేండ్లుగా కుర్చీ దొరకలేదా.. కుర్చీ మేమిస్తాం రండి..'' అని పోడు రైతుల పోరాట కమిటీ ఎద్దేవా చేసింది. పోడు రైతులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని.. రైతులకు తామున్నామంటూ భరోసా కల్పిస్తూ.. ఆయా పార్టీల ఆధ్వర్యంలో గురువారం బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ప్రారంభమైంది. అక్కడ నుంచి మర్రిగూడెం పంచాయతీ ఏడిప్పలగూడెం గ్రామం చేరుకుంది. గ్రామంలో గుండెపోటుతో మృతిచెందిన పోడు కుంజా రామయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం యాత్ర ఇల్లందుకు చేరుకుంది.
ఇల్లందులో భారీ ప్రదర్శన అనంతరం మార్కెట్ యార్డులో న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవునూరి మధు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. 'సీఎం కేసీఆర్ నిండు అసెంబ్లీలో పోడు సాగుదారులకు భరోసా ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్యమాలు చూసి పోడుదారులకు పట్టాలు నేనే ఇస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు.. సీఎం కేసీఆర్‌ది నాలుకా తాటి మట్టా' అని విమర్శించారు. కేసిఆర్ ఏమి చెప్పినా నమ్మకం కలగడం లేదన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చింలేదన్నారు. పోడు భూముల్లో కందకాలు తీసే హక్కు అటవీ అధికారులకు లేదన్నారు. కేసీఆర్ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. పోడు సాగుదారులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీి తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
కుర్చీ మేమిస్తాం రండి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 'ఎన్నికల సందర్భంగా ఇల్లందులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏజెన్సీలో పోడు సమస్య ఉంది. నేనే స్వయంగా ఇల్లందుకు వచ్చి కుర్చీ వేసుకుని పోడుదారులకు పట్టాలిస్తానని హామీ ఇచ్చారు' అని గుర్తుచేశారు. ఇది జరిగి ఏడు సంవత్సరాలు కావస్తోందనీ, అయినా సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. సీఎంకు ఇంకా కుర్చీ దొరకలేదా? దొరక్కపోతే మేమే కొనిస్తామని వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందట పోడు సమస్యను పరిష్కరిస్తామని దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కరించకపోగా మళ్లీ సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. దశాబ్దాల కిందట ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూమలు పంచింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. పోడు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని, మనోవేదనకు గురికావొద్దని, భరోసా ఇస్తాం, ధైర్యంగా ఉండండన్నారు.
నక్క దొంగలను తరిమికొట్టండి
టీఆర్ఎస్ పోడుదారులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదు. నక్క దొంగలను తరిమికొట్టాలి. నిలబడి కలబడి పోరాటం చేయాలి.. గిరిజనులు పోరాడితేనే భూములు దక్కుతాయి.
- జనశక్తి రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మకంటి కొమరన్న
కొట్లాడితేనే పోడు..
ఆదివాసీలు పోరాడితేనే పోడు దక్కుతుంది. ట్రెంచ్‌లు కొట్టే అధికారం అటవీ అధికారుకులకు లేదు. పోడు సమస్యను పరిష్కరిస్తానని ఎంఎల్ఎ హరిప్రియ ఎన్నికల వాగ్దానాలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే టీఆర్ఎస్లోకి పోయారు. పోడుదారుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు.
- న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు
పోడు భూముల కోసం పోరాడుతాం
గ్రామ సభల్లో పోడుసాగుదార్ల దరఖాస్తులు స్వీకరించి.. ఇప్పుడు వారి భూముల్లో కందకాలు తీయడం సరికాదు. చట్ట ప్రకారం పోడు భూముల కోసం పోరాడుతాం. గిరిజనులను భయాందోళనకు గురిచేయొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సు యాత్రతోనే మా పోరాటం ఆపం. తదుపరి కార్యాచరణతో ముందుకెళ్తాం. హైదరాబాద్ వెళ్లిన అనంతరం పోడు సమస్యలను గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజ శాఖ కమిషనర్, ఇతర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం. ఈ కార్యక్రమంలో టీట ీడీపీ రాష్ట్ర నాయకులు జీవన్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఆయా పార్టీల జిల్లా, మండలాల అధ్యక్ష కార్యదర్శులు, పోడు రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
- తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్
ఆదివాసులను వెళ్లగొట్టే పయత్నం
''సీఎం కేసీఆర్ పోడు సాగుదారులకు ఇచ్చిన హామీల మాటలు తప్పుతున్నారు. ఆదివాసులను అడవుల నుంచి వెల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. భూములను కార్పొరేట్లకు అప్పగించే కుట్రలు మానుకోవాలి. ''అడవులను కొట్టి పోడు వ్యవసాయం చేస్తున్నారు.. కోతులు ఇండ్లు, పొలాల్లోకి వస్తున్నాయని'' సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదు. ఒక్క తెలంగాణలోనే 2.5లక్షల ఎకరాలు ఓసీలకు అప్పగించారు. దీంతో లక్షల చెట్లు నేలమట్టమయ్యాయి. పర్యావరణం దెబ్బతింటోంది. హరితహారం పేరుతో రూ. కోట్లు కేటాయించి పోడు సాగుదారుల భూముల్లో మొక్కలు పెంచడం సరికాదు. మొక్కలు పెంచడానికి వారి భూమే కావల్సివచ్చిందా'' అని న్యూడెమోక్రసీ రాయలవర్గం రాష్ట్ర కార్యదర్శి రంగారావు ప్రశ్నించారు.
- న్యూడెమోక్రసీ రాయలవర్గం రాష్ట్ర కార్యదర్శి రంగారావు