Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా? కేసీఆర్ ఫాంహౌజ్ దాటితే ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేస్తారా? ఇదేం దారుణం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సీఎం పర్యటన నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలందర్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భద్రతాతనిఖీలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం భద్రతా తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టు బడిన ఉగ్రవాదుల డైరీలో హైదరాబాద్ బీజేపీ కార్యాలయం పేరు ఉండటం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు.
ఆ తర్వాత బీజేపీ కార్యాలయ సిబ్బందితో పోలీసు అధికారులు సమావేశమయ్యారు. బీజేపీ కార్యాలయానికి భద్రతకు అవసరమైన ఖర్చులు ఆ పార్టీనే భరించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.