Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడేండ్లలో కేంద్రం ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు
- మంత్రి సబితా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'దేశంలో తెలంగాణ భాగం కాదా?, ఏమిటీ వివక్ష, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులివ్వదా?'అని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని సైఫాబాద్ పీజీ కాలేజీలో రూ.11 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మూడు అంతస్తులతో 108 గదుల్లో 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేలా ఈ హాస్టల్ నిర్మాణం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నూతనంగా విద్యాలయాలు, నిధులను కేటాయించడం లేదని విమర్శించారు. కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని వివరించారు. కానీ కేంద్రం నిధుల కేటాయింపులో మాత్రం తెలంగాణ చివరిస్థానంలో ఉందన్నారు. ఏడేండ్లలో అనేక విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసిందనీ, తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 959 గురుకులాలను ప్రారంభించారని గుర్తు చేశారు. విద్యార్థినీల కోసం 30 మహిళా డిగ్రీ కాలేజీలు, న్యాయ కళాశాలను ఏర్పాటు చేశారని వివరించారు. కేంద్రం పైసా ఇవ్వకున్నా పాఠశాల విద్య కోసం రూ.11,735 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1,873 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని వివరించారు. తొలిదశలో రూ.3,497 కోట్లతో 9,123 పాఠశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.