Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాచలం పంచాయతీ ఎన్నికలను నిర్వహించే అంశంపై నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పాలనీ, లేదంటే చీఫ్ సెక్రటరీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఐదేండ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందంటూ గిరిజన నేత ఎస్.వీరయ్య వేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్నికలు నిర్వహించకుండా ఎంతకాలం ఉంటారని ప్రశ్నించింది. గిరిజన ప్రాంత పంచాయతీని మున్సిపాల్టీ చేయకూడదని చేయరాదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఎన్నికలు నిర్వహించే అంశంపై అనేక దఫాలుగా లేఖలు రాశామనీ, వాటిని నిర్వహించవద్దంటూ ప్రభుత్వం చెప్పిందని ఎస్ఈసీ న్యాయవాది చెప్పారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
రిట్ల కొట్టివేత
నానక్‌రాంగూడలోని 23 ఎకరాల్లోని జాగాలను ఎమ్మార్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం 20 ఏండ్ల కింద సేకరణ చేయడాన్ని తప్పుపడుతూ హరీష్ సహా 70 మంది వేసిన రిట్లను హైకోర్టు కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై తీర్పు చెప్పింది. కిరణ్ కృష్ణ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ భూములు కొన్నామనీ, తమకు తెలియకుండానే ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి భూసేకరణ చేసిందన్న వాదనను కొట్టేసింది. భూమిని సేకరించేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత కూడా పిటిషనర్లు భూమిని కొన్నారనీ, భూసేకరణ అధికారి ఎదుట తమ అభ్యంతరాలు చెప్పకుండా 15 ఏళ్ల తర్వాత రిట్లు వేసి కొత్త భూసేకరణచట్టం కింద పరిహారం ఇవ్వాలనీ, లేదంటే భూమికి భూమి ఇవ్వాలంటూ పిటిషనర్లకు కోరే హక్కు లేదని తీర్పులో పేర్కొంది.