Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గిరిజనులను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సింగరేణి చౌరస్తాలో ఆ సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8.6శాతంగా ఉన్న జనాభాకు కేవలం రూ. 2.79 శాతం మాత్రమే నిధులు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గిరిజనులకు అన్యాయం జరిగిందని వాపోయారు. గిరిజన సబ్ ప్లాన్‌కు రూ. 3.71 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం రూ. 89 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించకుండా ద్రోహం చేసిందన్నారు. కేవలం కోటి యాభై లక్షల రూపాయలతో గిరిజన యూనివర్సిటీని ఎలా ఏర్పాటు చేస్తారో రాష్ట్రంలోని బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అడవులు, అటవీ సంపదను ఆదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు అటవీ చట్టాల్లో మార్పులు చేస్తామని నిస్సిగ్గుగా బడ్జెట్లో ప్రకటించడం కేంద్ర ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. దేశంలో 10 లక్షల ఆదివాసీ, గిరిజన కుటుంబాలు అటవీ భూములపై హక్కులు కావాలని కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కరోనా మహమ్మారి కారణంగా ఆదివాసీ గిరిజన జీవితాలు చిన్నాభిన్నమై దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారిలో ఆకలిచావులు పెరిగే ప్రమాదం ఉన్నదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించినా ప్రభుత్వం నిధులు పెంచకపోగా నిత్యావసర సరుకుల సబ్సిడీని తగ్గించడం అన్యాయమని విమర్శించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ బీజేపీ గిరిజన వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా కోట్లాది మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారనీ, ఆ చట్టానికి మరిన్ని నిధులు కేటాయించి ఉపాధిని పెంచకపోగా నిధులు తగ్గించడం హేయమైన చర్య అన్నారు. గిరిజనుల విద్య ,వైద్యం వంటి కీలక రంగాల్లో సైతం నిధులను కోత పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని విమర్శించారు. గిరిజనుల్లో ఆకలి చావులను పెంచే విధంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య సీనియర్ నాయకులు ఆర్. శంకర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా, ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘు ఎరుకుల, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎం. బాలు నాయక్, కోర్రా భరత్, ఆర్. శేఖర్ నాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు