Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మందమర్రి ఏరియాలో తప్పుడు బిల్లులు, ఓచర్లతో కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నది. బొగ్గుగని కార్మికులకు దక్కాల్సిన సొమ్మును కొందరు స్వార్ధపరులు కాజేస్తున్నారు. తప్పుడు బిల్లులు పెట్టినవారిపైనా, వారికి సహకరించినవారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అవినీతిపై సింగరేణి యాజమాన్యం సమగ్ర విచారణ జరిపించాలి' అని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మందమర్రి జీఎం కార్యాలయం వద్ద డ్రైవర్లు చేస్తున్న ఆందోళనకు సింగరేణి పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు మద్దతివ్వాలని కోరారు. మందమర్రి ఏరియాలో వర్క్‌షాప్, కెకె 5, మందమర్రి ఓసి, ఆర్కె ఓసి, శాంతిఖనిలలో మెటీరియల్‌ను తరలించడానికి 5 లారీలను సప్లై చేయడానికి శ్రీవాత్స కాంట్రాక్ట్ టెండర్ పొందారనీ, 13 నెలల నుంచి తప్పుడుబిల్లులు, బ్యాంకు ఓచర్లు పెట్టి రూ.13 లక్షలను కాజేశారని విమర్శించారు. కాంట్రాక్టు డ్రైవర్లకు రూ.14 వేతనం మాత్రమే ఇచ్చి రూ.27,400 ఇస్తున్నట్టు చూపుతున్న తీరును వివరించారు. సీఎంపీఎఫ్ అమలు చేయకుండా, బోనస్ చెల్లించకుండా కార్మికుల పొట్టగొట్టి ప్రతి నెలా రూ.30 వేలు కాజేస్తున్నారని విమర్శించారు. ఈ తప్పుడు బిల్లుల బాగోతంలో అధికారులకూ వాటా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. శాంతిఖని బుదా గెస్ట్‌హౌస్ టెండర్లో కూడా ఇలాగే కార్మికులకు వేతనాలు చెల్లించకుండా తప్పుడు బ్యాంకు ఓచర్లతో లక్షల రూపాయలు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఏరియా అధికారులు తప్పుడు బ్యాంక్ ఓచర్లు, బిల్లులపై తగు విచారణ జరిపి కారకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.