Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాచలం సరిహద్దుల దిగ్బంధనం విజయవంతం
- అఖిలపక్షం ఆందోళన ఉద్రిక్తం
- నాయకుల అరెస్ట్.. సీపీఐ(ఎం) కార్యకర్తలకు గాయాలు
నవతెలంగాణ-భద్రాచలం
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఏపీ నుంచి ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలుపుతూ స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన భద్రాచలం సరిహద్దుల దిగ్బంధనం విజయవంతం అయింది. కూనవరం, చర్ల, పురుషోత్తపట్నం, బ్రిడ్జి రోడ్డు వద్ద అఖిలపక్ష పార్టీల కార్యకర్తలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రహదారిని దిగ్బంధించారు. బ్రిడ్జి సెంటర్ వద్ద రహదారి దిగ్బంధనం ఉద్రిక్తతకు దారి తీసింది. నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణ విభజనలో భద్రాచలం నియోజకవర్గం తీవ్రంగా నష్టపోయిందని, ఈ నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత పాలకవర్గాల మీద ఉందన్నారు. భద్రాచలం అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశంపై చర్చ చేయాలని కోరారు. రహదారుల దిగ్బంధనంలో బ్రిడ్జి సెంటర్ వద్ద అరెస్టుల సందర్భంగా పోలీసులకు, నాయకులకు మధ్యన జరిగిన తోపులాటలో సీపీఐ(ఎం) కార్యకర్తలు పద్మ, సీత, రాధకు గాయాలయ్యాయి. అరెస్టు అయిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జె.రమేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరెల్ల నరేష్, సీపీఐ(ఎం), సీపీఐ పట్టణ కార్యదర్శులు గడ్డం స్వామి, ఎ.సునీల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబీ నరసారెడ్డి, నాయకులు వై.వెంకటరామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతిరాల రవి కుమార్, బోలిశెట్టి రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల కల్పన ఉన్నారు.
నాయకులను విడుదల చేయాలని స్టేషన్ ముందు ధర్నా
సరిహద్దు దిగ్భంధనం, వంటావార్పు కార్యక్రమంలో పోలీసులు అరెస్టు చేసిన అఖిలపక్ష నాయకులను విడుదల చేయాలని పోలీసు స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం నాయకులను పోలీసులు విడుదల చేశారు.