Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
- వందలాదిగా తరలివచ్చిన బాధితులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2008 డీఎస్సీ బాధిత అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద అలకదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వందలాది మంది తరలివచ్చారు. ''సీఎంగారూ న్యాయం చేయండి..న్యాయం చేయండి..కామన్ మెరిట్ లిస్టులో ఎంపికైనా డీఈడీ అభ్యర్థులకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయం..అన్యాయం..జీవోలో ఒకలా? నియామకాలు మరోలాగా? ఇదేమి న్యాయం..ఇదేమి న్యాయం...' అంటూ పెద్దపెట్టున నినదించారు. ఈ సందర్భంగా టీఎస్ బీఈడీ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, గౌరవాధ్యక్షులు పి.వెలుగుజ్యోతి మాట్లాడుతూ..డీఎస్సీ 2008 నోటిఫికేషన్లో సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల్లో వంద శాతం కామన్ మెరిట్ లిస్టు ప్రకారమే నియామకాలు చేపడతామని అప్పటి ప్రభుత్వం పేర్కొని ఆ తర్వాత ప్రత్యేకంగా 30 శాతం కోటా రిజర్వేషన్ ద్వారా డీఈడీ అభ్యర్థులకు జాబులివ్వడం దారుణమన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్టులో ఉన్నవారికి కాకుండా డీఈడీ వారికి ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. ఆ తర్వాత రెండు నెలలకు మరో జీవో తీసుకొచ్చి బీఈడీ విద్యార్థుల పొట్టగొట్టారని వాపోయారు. సర్కారు నిర్ణయం వల్ల 72 నుంచి 60 మార్కుల దాకా వచ్చిన బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనీ, అదే 45 మార్కులొచ్చిన డీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలొచ్చాయనీ, చివరకు 4.5 మార్కులు వచ్చినవారికి కూడా కొలువు ఇచ్చారని వివరించారు. హైకోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వచ్చినప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక, లాయర్లకు ఫీజులు చెల్లించలేక అప్పులపాలవుతున్నామని వాపోయారు. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ2008లో నష్టపోయిన వారికి న్యాయం చేయడంలో భాగంగా కమిటీ వేసిందనీ, వారికి నిజంగానే అన్యాయం జరిగిందని గుర్తించిందని తెలిపారు. అందులో భాగంగానే వారికి జీవో 39 ద్వారా మినిమం టైమ్ స్కేల్ పద్ధతిలో సెంకడరీ గ్రేడ్ టీచర్లుగా నియమించిందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం అలా జరగలేదన్నారు. డీఎస్సీ 2008లో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామనీ, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి అయినా ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా 2016లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అడ్వకేట్ జనరల్ కూడా రూ.25 వేల వేతనంతో ఉద్యోగం ఇవ్వొచ్చని నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. సర్కారు నిర్ణయం వల్ల రోడ్డుపాలైన వేలాది కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను వారు కోరారు. ఈ దీక్షలో శ్రీనివాస్చావ్లా, జయప్రకాశ్, భరత్, సంగమేశ్, మధుసూదన్, నగేశ్, ప్రమోద్, ఏ.మురళి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.