Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిభావంతులకు రూ.5.30 కోట్ల ఫీజు రాయితీ
- 500 మందికి ల్యాప్‌టాప్‌ల బహుమతి
- అనురాగ్ వర్సిటీ చాన్సలర్ దేశారు,వీసీ రామచంద్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 'అనురాగ్ సెట్' నిర్వహిస్తున్నామని ఆ వర్సిటీ చాన్సలర్ యూబీ దేశారు, వీసీ ఎస్ రామచంద్రం చెప్పారు. మార్చి నాలుగు నుంచి ఆరో తేదీ వరకూ రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నిర్వహించే ఈ సెట్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని అన్నారు. దరఖాస్తు చేసేందుకు మార్చి మూడో తేదీ వరకు గడువుందన్నారు. ఈ పరీక్ష ఫలితాలను మార్చి 26న వెల్లడిస్తామనీ, మే 16, 17 తేదీల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపడతామని చెప్పారు. అనురాగ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.5.30 కోట్ల వరకు ఫీజు రాయితీ కల్పిస్తున్నామని వివరించారు. మొదటి పది ర్యాంకులు పొందిన విద్యార్థులకు వంద శాతం ఫీజు మినహాయింపు ఉంటుందనీ, ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. 11 నుంచి 25 ర్యాంకుల వరకు 50 శాతం, 26 నుంచి 100 ర్యాంకుల వరకు 25 శాతం ఫీజులో రాయితీ ఇస్తామని అన్నారు. మొదటి 500 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాప్‌టాప్‌లు అందిస్తామన్నారు. అనురాగ్ సెట్ ద్వారా ఇంజినీరింగ్‌లో 1,500 సీట్లు, అగ్రికల్చర్లో 240 సీట్లు భర్తీ చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ వార్షిక ఫీజు రూ.2.50 లక్షలు, అగ్రికల్చర్ వార్షిక ఫీజు రూ.2.40 లక్షలు ఉంటుందని వివరించారు. అనురాగ్ విశ్వవిద్యాలయ సీఈవో సూర్యదేవర నీలిమ మాట్లాడుతూ సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 1,360 సీట్లున్నాయనీ, ఇందులో కన్వీనర్ కోటాలో 1,200 సీట్లు, యాజమాన్య కోటాలో 360 సీట్లున్నాయని చెప్పారు. ఈ సీట్లకు టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన రూ.1.25 లక్షల ఫీజునే వసూలు చేస్తామన్నారు. తమ విశ్వవిద్యాలయంలో మెరుగైన వసతులు, అత్యాధునిక ల్యాబోరేటరీలు, డిజిటల్ తరగతి గదులు, అర్హులైన అధ్యాపకులున్నారని అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 2020లో వెయ్యి మంది, 2021లో 1,500 మంది, ప్రస్తుత విద్యాసంవత్సరంలో 1700 మందికిపైగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారని వివరించారు. రూ.38 లక్షల గరిష్ట వార్షిక వేతనం పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సైదా సమీన్ ఫాతిమా, అనురాగ్ సెట్ కన్వీనర్ ఎం శ్రీనివాసరావు, నిర్వాహకులు అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.