Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర
- బడ్జెట్లో పేదలకు తీవ్ర అన్యాయం
- ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధంగా ఉందని.. పేదలకు తీవ్ర అన్యాయం చేశారని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో తిరందాసు గోపి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో బడ్జెట్‌పై స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సారంపల్లి మాట్లాడుతూ.. దేశంలో 140 కోట్ల జనాభా ఉండగా 70 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారన్నారు. కరోనాతో, ఉపాధి లేక పట్టణాల నుంచి 20 కోట్ల మంది గ్రామాలకు తిరిగి వచ్చారన్నారు. 15 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయన్నారు.
బడ్జెట్లో వ్యవసాయానికి లక్షా 24 వేల కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను రైతులు పండించారని తెలిపారు. 33 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్నారన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలు పరిశోధన చేసి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, పంట నష్టపరిహారం ఇస్తే రైతు ఆత్మహత్యలు జరగవని చెప్పారు. దేశంలో 9 కోట్ల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. చాలా మంది రైతులు వ్యవసాయం వదిలిపెట్టి వెళ్తున్నారన్నారు.
సీపీఐ(ఎం) పోరాటాల ఫలితంగా 2006లో ఉపాధి హామీ చట్టం వచ్చిందన్నారు. 2020-21లో లక్షా 11వేల కోట్ల రూపాయలు, 2021-22లో రూ.98 వేల కోట్లు, 2022-23లో బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.73వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇందులో రూ.23వేల కోట్లు యంత్రాలకే ఖర్చు పెడ్తారని తెలిపారు. మరో రూ.15వేల కోట్లు పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని తెలిపారు. 40 కోట్ల మంది ఉపాధిహామీలో పనిచేస్తున్నారని చెప్పారు. ఉపాధిహామీ చట్టం దేశంలోనే ఎంతో కీలకమైందన్నారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించడమే కాకుండా విద్య, వైద్యం, దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా సంక్షేమం అభివృద్ధి పట్ల బడ్జెట్లో తక్కువగా నిధులు కేటాయించడం అన్యాయమన్నారు. ఉపాధిహామీ చట్టమే పేదల కడుపు నింపుతుందన్నారు. అలాంటి చట్టానికి క్రమంగా నిధులు తగ్గించడం దారుణమన్నారు. దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుందని విమర్శించారు. పేదలను కూటికి దూరం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అవ్వారు గోవర్థన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్, నాయకులు దోనూరి నర్సిరెడ్డి, రొడ్డ అంజయ్య, బూర్గు కృష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, తడక మోహన్, దోడ యాదిరెడ్డి, గంగదేవి సైదులు, పైళ్ల లింగారెడ్డి, ప్రసాదం విష్ణు, గుంటోజు శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.