Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోట్ల విలువ గల భూముల్లో అక్రమ కట్టడాలు
- ఎఫ్టీఎల్లో ఓ ఫుడ్ కంపెనీ నిర్మాణాలు
- సర్వీస్ రోడ్డును ఆక్రమించిన కొత్తురు లాజిస్టిక్ పార్క్ నిర్వాహకులు
- పాటు కాలువల కబ్జాతో ఎండుతున్న చెరువులు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ప్రజా సంఘాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా పెడుతున్నారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకుంటున్నారు. చివరికి చెరువులను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి.. ఆనవాలు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువు శికం, పాటు కాల్వలు, సర్వీస్ రోడ్లను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కోట్ల విలువైన భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి.
భూముల ధరలకు రెక్కలు రావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ భూమి ఖాళీగా కనిపిస్తే అక్కడ అక్రమార్కులు పాగా వేస్తున్నారు. కబ్జా చేసే వారంతా రాజకీయ నాయకుల అండదండలు ఉన్న బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే కావడంతో అధికారుల సైతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మండల పరిధిలో రవి ఫుడ్ కంపెనీ ఏకంగా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టినట్టు సమాచారం. బొద్దికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 15 ఎకరాలు ఉందని అధికారులు గుర్తించారు. కానీ ప్రస్తుతం అక్కడ 5 ఎకరాలు కూడా లేదు. చెరువు శికం 9.20 ఎకరాలు ఉండగా, మరో 5 ఎకరాలు ఎఫ్టీఎల్గా గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్లో పట్టా భూములు ఉన్నప్పటికీ వ్యవసాయానికి తప్ప ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి అవకాశం లేదు. కానీ నిబంధనలు తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టారు. పట్టా ఉన్న ఎఫ్టీఎల్తోపాటు మరో రెండు మూడెకరాల చెరువు శికం భూములను ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇటీవల ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టి.. దాదాపు రెండున్నర ఎకరాలు కబ్జాకు గురైనట్టు అంచనా వేశారు. ఈ భూమి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం సుమారు రూ.5కోట్లు ఉంటుంది. ఇదే కంపెనీ యాజమాన్యం కాశన్న చెరువుల నుంచి బొద్దికుంట చెరువులకు వచ్చే 6 మీటర్ల విస్తీర్ణంతో కూడిన కిలో మీటరు మేరకు ఉన్న పాటు కాలువను కబ్జా పెట్టిందని తెలిసింది. దీంతో బొద్దికుంట చెరువుకు వెళ్లాల్సిన వరద నీరు వెళ్లడం లేదు. ఆ చెరువు కింది ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. ఇలాంటి విషయాలు మా వద్దకు రావడం లేదని, పైపైనే జరుగుతున్నాయని కొంతమంది అధికారులు వాపోతున్నారు. నిబంధనలు ఉన్నా.. మాకు తెలియకుండానే అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారని చెప్పడం గమనార్హం.ఇదిలా ఉంటే, మరో ప్రయివేటు సంస్థ కొత్తూరు లాజిస్టిక్ పార్కుతో నిర్మాణాలు చేపడుతోంది. 30 మీటర్ల విస్తీర్ణంతో ఉన్న సర్వీస్ రోడ్డును 15 మీటర్ల మేర సుమారు 2 కిలో మీటర్లు ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతోంది.అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడ నట్టు వదిలేస్తున్నారు.పరిశ్రమల పేరు తో పురాతన చెరువు శికం, కాలువలను, ఎన్నో ఏండ్లు ఉన్న రోడ్లను కనమరుగు చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు.
చెరువు శికం భూముల కబ్జాలపై చర్యలు తీసుకుంటాం
బొద్దికుంట చెరువు ఎఫ్టీఎల్ భూములను సర్వే చేశాం. అందులో ప్రయివేటు సంస్థ రవి ఫూడ్ కంపెనీ కొంత మేరకు నిర్మాణాలు చేపట్టినట్టు అంచనాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. చెరువు శికంలో ఉన్న నిర్మాణాలను కూల్చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
ప్రసన్న లక్ష్మి - ఇరిగేషన్ డీఈ
చెరువు ఆనవాళ్లు లేకుండా చేశారు
బొద్దికుంట చెరువు కబ్జాకు గురవుతోంది. ఇదే విషయం ఎన్నోసార్లు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు మత్స్యశాఖ సహకార సంఘం తరుపున ఫిర్యాదు చేసినం. అధికారులు సర్వే చేసి గోడ కూలగొ ట్టారు. కూల్చిన ఆరు నెలలకే మళ్లీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అక్కడ చెరువు ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
రవి- కొత్తురు గ్రామం
ప్రభుత్వ భూములను కాపాడాలి
ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ కొరవడి పెద్ద సంఖ్యలో భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణకు గురైన భూములపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. బొద్దికుంట చెరువు శికం భూముల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలి. లేనిపక్షంలో భవిష్యత్లో పెద్దఎత్తున్న ఉద్యమాలు చేపడుతాం.
సాయిబాబు- సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు