Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు రైతుల గోడు పట్టని సర్కార్
- పట్టాలివ్వకపోగా..భూములు లాక్కుంటున్న వైనం
- అటవీ అధికారుల వేధింపులతో ఆందోళన
- ఆత్మహత్యలే శరణ్యమంటున్న గిరిజనులు
ఎస్. వెంకన్న
''ఆ భూమి మాదే. ముప్పై ఏండ్లనుంచి ద్నున్నుకుంటున్నం. ఆ భూమిలో పండిన ఫలసాయంతోనే కొడుకును, బిడ్డను చదివించాం. వారు ఎదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నారు. 15 రోజుల కింద (జనవరి 28) ఫారెస్టోల్లు వచ్చిండ్రు. ఇది అటవీ భూమి, దీంట్లోకి మీరు రావొద్దంటూ ట్రెంచ్‌లు గొట్టజూసిండ్రు. ప్రొక్లైన్లకు అడ్డం దిగినం. ఫారెస్టు అధికారులు నెట్టేస్తే మా ఆయన కిందపడి చనిపోయిండు. అంటూ కుంజా రామయ్య భార్య పోడు భూముల సాధన కమిటీ నాయకుల ముందు కన్నీటి పర్యంతమైంది''. '' మా ఊర్లో వందకు పైగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్నాయి. 14 ఎస్సీ కుటుంబాలకు చెందిన 180 ఎకరాల భూమి ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 ఏండ్లనుంచి సాగులో ఉన్నాం. హక్కులు కల్పించాలని దరఖాస్తులు కూడా పెట్టుకున్నాం. అయినా అటవీ అధికారులు దౌర్జన్యంగా కందకాలు తొవ్వారు. ఆ భూమే మాకు ఆదెరువు. అది పోతే బతికేదెట్టా? ఊరిడ్సిపోయి వేరే కాడ బతకలేం. చావే దిక్కు అనిపిస్తున్నది. మా ఊర్లోని గిరిజనుల పరిస్థితి ఇదే''. గుండాల మండలం తూరుబాక గ్రామానికి చెందిన ఓ..పోడు రైతు గొగ్గెళ్ల లక్ష్మయ్య ఆవేదన ఇది.
''కాచనపల్లి, జగ్గుతండా, లక్ష్మిదేవి పల్లి గ్రామాలలో 370 కుటుంబాలకు పైగా ఉన్నాయి. సుమారు 20 ఏండ్లనుంచి 16 వందల ఎకరాలకుపైగా పోడుభూమిపై ఆధారపడి బతుకుతున్నారు. 2005లో సర్వేలు చేసి అక్కడక్కడ కొందరికి పట్టాలిచ్చారు. మిగిలిన రైతులు పోయిన నెల దరఖాస్తు చేసుకున్నారు. కానీ..ఫారెస్టు అధికారులు ఇప్పుడు ట్రెంచ్‌లు కొడుతున్నరు. ప్రొక్లైన్లతో కందకాలు తొవ్వుతున్నరు. భూమిలోకి వస్తే జైలుకు పోతరని బెదిరిస్తున్నరు. కొన్ని చోట్ల పట్టాలిచ్చిన భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ భూములు పోతే..బతుకంతా చీకటే''..-గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన పూనెం రంగయ్య బాధ ఇది.
ఒకరిద్దరి పోడు రైతుల ఆవేదన, ఆందోళన కాదిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 17 మండలాల్లోని 60నుంచి 70 గ్రామాల పోడు రైతుల వ్యథ. వారిపై అటవీ అధికారుల వేధింపులు, దాడులు సాగుతూనే ఉన్నాయి. 23 జిల్లాల్లో ఉన్న సుమారు 10లక్షల ఎకరాల్లో పోడుపై ఆధారపడి బతుకుతున్న రైతుల బాధలకు ప్రత్యక్ష సాక్షాలివే.
రాష్ట్రంలో 24 జిల్లాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో పోడు సమస్య ఉంది. గోండులు, కొలాంలు, నాయక్‌పోడ్‌లు, బంజారాలు, కోయలు, తోటి లాంటి గిరిజన తెగలతోపాటు కొంత మంది గిరిజేతరులు ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో వామపక్షాల ఒత్తిడితో ఆ నాటి యూపీఏ-1 ప్రభుత్వం 'అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్) 2006' ను అమల్లోక్తి తెచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర సర్వే చేసి 2005 డిసెంబర్ 13 వరకు సాగులో ఉన్న పోడు భూములపై గిరిజనులకే హక్కులు కల్పించాలని ఆదేశించింది. ఫలితంగా 2007లో అప్పటి ప్రభుత్వం పోడు భూములపై సర్వే చేయించగా తెలంగాణ పరిధిలో 2,12,173 వ్యక్తిగత దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తుల ప్రకారం 7,61,061 ఎకరాలపై హక్కులు ఇవ్వాలని పెట్టుకోగా కేవలం 93,639 మంది దరఖాస్తులకు 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కులిచ్చింది. మిగిలిన 10లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది.
పోడు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయకుండా ఇక్కడొకటి చెప్పి..అక్కడొకటి చేయటంతో పోడు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ''పోడు సమస్యలనుసాధ్యమైనంత త్వరగా తేల్చేస్తం.. అన్ని జిల్లాలు, డివిజన్లకు స్వయంగా నేనే పోత..మంత్రులను, ఫారెస్టు ఆఫీసర్లను, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీలందర్ని తీసు కెళ్త.. ఎక్కడికక్కడే ప్రజాదర్బార్లు పెట్టి..ఇదిగో మీ పోడు.. ఇదిగో మీ పట్టా అని ఇచ్చేస్తం.. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకా రం ఈ పోడు భూములకు హక్కులు కల్పించి, సమస్యకు శాశ్వతంగా ముగింపు పలుకుతం.'' కేసీఆర్ నిండు శాసన సభలో చెప్పిన మాటలివి. ఈ మాట నిలబెట్టుకోని సర్కార్‌కు వ్యతిరేకంగా పోయినేడు రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, గిరిజన సంఘాల నాయకత్వంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. దీంతో సర్కార్ దిగొచ్చి పోడు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చింది. దరఖాస్తులకు గడువు ప్రకటించింది. మూడు నెలల పాటు కొనసాగాల్సిన దరఖాస్తుల ప్రక్రియను ఎక్కువ సమయం ఇస్తే అధికంగా అర్జీలు వస్తాయనే ఉద్దేశంతో నెల రోజుల్లో సర్కారు మమ అనిపించింది. నిబంధనల ప్రకారం అటవీ హక్కుల కమిటీ (ఎఫ్ఆర్సీ)ద్వారా దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా గ్రామ కార్యదర్శులు స్వీకరించారు. అయినా.. లబ్దిదారులు కొద్దిపాటి సమయాన్నైనా వినియోగించుకోవాలని దరఖా స్తులు పెట్టుకున్నారు. ఎన్నో కొర్రీల నడుమ తగిన ఆధారా లతో దరఖాస్తులిచ్చారు. అశాస్త్రీయమైన శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించిన పోడు భూముల కన్నా అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఎలాగోలా పోడు హక్కు పత్రాలను ఓ ఏడాదిపాటు సాగదీసి ఎన్నికలకు ముందు వాటిని ఇచ్చి లబ్దిపొందాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పోడు రైతు పోరాట కమిటీతో పాటు గిరిజ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సర్కార్ డబుల్ గేమ్..
పోడు రైతులతో సర్కార్ డబుల్ గేమ్ ఆడుతున్నది. అర్హత ఉన్న పోడు రైతులందరికీ పట్టాలిస్తామని చెబుతూనే మరోవైపు అదే పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని అటవీ అధికారులకు తెరవెనుక నుంచి ఆదేశాలిస్తున్నారు. దీంతో పోడు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అటవీ అధికారులు దాడులు చేస్తున్నారు. బతుకు ఆదెరువైన భూమిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదనీ, ప్రాణాలు పోయినా సరే తిండి పెట్టే భూములను కాపాడుకోవాలని ఆదివాసీలు, గిరిజనులు పోరాడుతున్నారు. సర్కారు ఆడుతున్న ఈ గేమ్‌లో పోడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు.
నాన్చుడి ధోరణి తగదు.
పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని రెండు నెల్ల కింద హడావిడి చేసిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు నాన్చుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనులు, గిరిజనేతరుల నుంచి సుమారు రెండున్నర లక్షలకు పైగా దరఖాస్తులు తీసుకుని నెలలు గడుస్తున్నా..తగిన విధంగా ప్రభుత్వం స్పందించటం లేదు. పైగా దరఖాస్తుల చేసుకున్న వారి భూములలో ట్రెంచ్‌లు కొడుతున్నారు. కందకాలు తొవ్వుతున్నారు. పోడు రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది మానుకోవాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవు.
-ఆర్ శ్రీరాం నాయక్
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి