Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ గూండాల దౌర్జన్యం
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావిద్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యాలయాల్లో మతం పేరుతో మారణహోమం వద్దనీ, దాన్ని అందరూ వ్యతిరేకించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావిద్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని నారాయణగూడ చౌరస్తాలో ప్రదర్శన నిర్వహించి విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యాలయాల్లో మతం, కులం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నదని విమర్శించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం మతం వ్యక్తిగత స్వేచ్ఛ అని అన్నారు. అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. విద్యార్థుల మెదళ్లలో మత విద్వేషాలను నింపేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నాయన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సమాధి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. మతోన్మాద మూకలు జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండాను ఎగురేయడం దారుణమని విమర్శించారు. భవిష్యత్తులో కాషాయ జెండాను జాతీయ జెండా చేస్తామంటూ కర్నాటక మంత్రి ఈశ్వరప్ప వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. తలకు స్కార్ఫ్ చుట్టుకుని వస్తే మిగతావారికి కలిగే నష్టమేమిటని ప్రశ్నించారు. కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు వారి సంస్కృతుల్లో భాగమని అన్నారు. ఒకరి సంప్రదాయాలను ఇంకొకరు గౌరవించడమే భారతీయత అని వివరించారు. కర్నాటకలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ గూండాల దౌర్జన్యం నశించాలని డిమాండ్ చేశారు. విద్యాలయాల్లో మత ఘర్షణలు రేపుతున్న బీజేపీకి విద్యార్థులు, మేధావులే గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్‌రెడ్డి, నాయకులు వేణు, శ్రీమన్, అజరు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
హిజాబ్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దు : డీవైఎఫ్ఐ
కర్నాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దనీ, మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని కాషాయదళం మైనార్టీలను లక్ష్యం చేసుకునే తన మత ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్తున్నదని విమర్శించారు. విద్వేషపూరిత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.