Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ పై కేంద్రానికి రాజకీయ దృక్పథం కరువు
- డిమాండ్ వైపు కాదు.. సప్లయి వైపు ఆలోచిస్తున్న సర్కార్
- ద్రవ్యోల్బణం నియంత్రణకు చర్యలేవి..? ొ అసమానతలను పెంచే పద్దు
- 25న నిరసన దినాన్ని జయప్రదం చేయండి : కేంద్ర బడ్జెట్‌పై సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్... ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు పరిష్కారం చూపలేదని పలువురు వక్తలు చెప్పారు. ఇందుకు సంబం ధించి మోడీ సర్కారుకు రాజ కీయ దృక్పథం కొరవడిందని వారు విమర్శించారు. ప్రజల అవసరాలు, వారి డిమాండ్ల ఆధారంగా కాకుండా... పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వారి కంపెనీల్లో తయారవుతున్న వస్తువులు, వాటి సప్లయికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు బడ్జెట్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగాలకు బడ్జెట్లో కోతలు విధించటం వల్ల ఇప్పుడున్న అసమానతలు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న నిర్వహించతలపెట్టిన 'బడ్జెట్‌పై నిరసన దినాన్ని' జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 'కేంద్ర బడ్జెట్ - ఆర్థిక రంగంపై దాని ప్రభావం...' అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహించారు. పట్నం, సీఐటీయూ, ఐద్వా, వ్యకాస, రైతు సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఆర్థిక నిపుణులు డి.పాపారావు, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) అధ్యక్షుడు వి.రమేశ్ వక్తలుగా ప్రసంగించారు. పట్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి నర్సింహారావు సెమినార్‌కు అధ్యక్షత వహించారు. నాగేశ్వర్ మాట్లాడుతూ... 'ప్రభుత్వం ప్రతీయేటా తన ఆర్థిక వనరులను సమీకరించుకోవటం ద్వారా ఆర్థిక సవాళ్లను పరిష్కరించుకోవటాన్నే బడ్జెట్ ప్రక్రియ అంటారు...' అని నిర్వచించారు. అయితే ప్రస్తుత బడ్జెట్... కరోనా వల్ల దేశంలో సంభవించిన సవాళ్లను పరిష్కరించేదిగా లేదని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో... కోవిడ్ సమయంలో కూడా దేశం ఆర్థిక వృద్ధిని సాధించిందంటూ చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. ఒకవైపు ప్రజల ఆదాయాలు పడిపోయి, ఉద్యోగాలు ఊడిపోయిన తరుణంలో ఆర్థిక వృద్ధి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచటం ద్వారానే ఖజానాను నింపుకున్నారని చెప్పారు. ఇది నిజమైన ఆర్థిక వృద్ధా..? అని ప్రశ్నించారు. సంపన్న వర్గాలపై పన్నులేయకుండా పేదల్ని పిప్పి చేయటమే మీ విధానమా..? అని ప్రశ్నించారు. కరోనా సంక్షోభ సమయంలోనే ఆదానీ విమానాశ్రయాలకు ప్రయాణీకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. ప్రస్తుత బడ్జెట్లో గతేడాదితో పోలిస్తే ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లు తగ్గించారని గుర్తు చేశారు. 2021-22 బడ్జెట్లో వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.లక్ష కోట్లు కేటాయించామంటూ చెప్పిన కేంద్రం.. ఈ యేడాది పద్దులో ఆ అంశానికి కేవలం రూ.500 కోట్లే విదిల్చారని ఎద్దేవా చేశారు. ఆహార సబ్సిడీకి 25 శాతం నిధులు తగ్గించటం, మధ్యాహ్న భోజన పథకం కేటాయింపుల్లో రూ.1,267 కోట్లు తగ్గించటమనేది దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆహార ధాన్యాల నిల్వల్లో అగ్రభాగంలో ఉన్న మనం... అదే రీతిలో ఆకలి కేకల్లోనూ అగ్రభాగంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 10 కోట్ల టన్నుల గోధుమలు, బియ్యం గోదాముల్లో మూలుగుతున్నా పేదలకు వాటిని పంచటానికి ప్రభుత్వానికి చేతులు రావటం లేదని విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో 'ప్రధానమంత్రి పోషణ్...' లాంటి ముద్దు ముద్దు పేర్లతో పథకాలు పెడితే ఏం ప్రయోజనమని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. పాపారావు మాట్లాడుతూ... బడ్జెట్ సరిపోకపోతే అదనంగా నోట్లను ముద్రించటం ద్వారా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచాలని సూచించారు. దీన్నే ద్రవ్యలోటు అంటామని వివరించారు. కానీ ఫైనాన్స్ పెట్టుబడి దాన్ని అంగీకరించబోదని చెప్పారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వ్యయం నానాటికీ తగ్గిపోవటానికి ఇదే కారణమని అన్నారు. ప్రజలు ఆకలితో అలమటించినా ఫరవాలేదు.. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరటం శోచనీయమని అన్నారు. రమేశ్ మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వల్ల జరిగే నష్టాలను సోదాహరణంగా వివరించారు. ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలను నియంత్రించాల్సిన సర్కారు అందుకు భిన్నంగా వాటికి రాయితీలివ్వటం దారుణమన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రాయితీలివ్వకుండా ఉపాధి కల్పనా రంగాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్.సాయిబాబు కూడా ప్రసంగించిన ఈ సెమినార్లో ఐద్వా, రైతుసంఘం, వ్యకాస ప్రధాన కార్యదర్శులు మల్లు లక్ష్మి, టి.సాగర్, ఆర్.వెంకటరాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ పాల్గొన్నారు.