Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం..
- ఢిల్లీ కోటలు బద్దలు కొడతాం
- ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు
- మమ్మల్ని టచ్ చేస్తే ఊరుకోం..
- ధాన్యం కొనరంట.. సాగు పెట్టుబడి ధరలు పెంచారు
- గోదావరి జలాలతో జనగామ పాదాలు కడుగుతం
- మెడికల్, డిగ్రీ కాలేజీల మంజూరు: జనగామ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
''కేంద్రం విద్యుత్ సంస్కరణల పేరిట.. ప్రతి మోటార్కూ మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తోం ది.. ప్రాణం పోయినా మీటర్లు పెట్టనివ్వ.. రైతులను ఆగం చేస్తున్రు.. కేంద్రంపై తిరగబడదాం.. అవసర మైతే ఢిల్లీ వెళ్లి కోట్లాడతాం.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుదాం..'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలో సమీ కృత జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభిం చారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారి టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం యశ్వంత్‌పూర్ వద్ద జరిగిన బహిరంగ సభకు రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్, తాను ఈ ప్రాంతంలో సమస్యలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. బచ్చన్నపేటలో మీటింగ్‌కు వెళితే అందరూ ముసలోళ్లే వచ్చిండ్రు.. యువకులేరీ అంటే 8 ఏండ్లుగా కరువులో వున్నామని, పనుల కోసం పట్నం పోయిండ్రని చెబితే కన్నీళ్లొచ్చాయన్నారు. తెలంగాణ తెచ్చుకున్నాక బచ్చన్నపేట బతుకులు బాగుపడుతున్నరు.. జనగామలో పంటలు పండుతున్నరు.. గోదావరి నీళ్లు తెచ్చి జనగామ కాళ్లు కడిగే కార్యక్రమాలు చేపట్టాం. రాబోయే ఏడాదిలో అన్ని చెరువుల్లో నీళ్లు నింపుతాం. సమ్మక్క బ్యారేజీ పూర్తయింది.. 365 రోజులపాటు దేవాదుల ప్రాజెక్టును వినియోగించుకొని గోదావరి జలాలతో జనగామ పాదాలు కడుగుతాం.. జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాం. దీనిపై రెండు 3 రోజుల్లోనే జీవో జారీ చేస్తాం. పాలకుర్తిలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తాం.. దళిత జీవితాలు బాగుపడాలి. ఈ ఏడాది 40వేల కుటుంబాలకు దళితబంధు ఇస్తాం.. రాష్ట్రంలోని 17లక్షల దళిత కుటుంబాలకు విడతల వారీగా దళితబంధు అమలు చేస్తాం' అని సీఎం చెప్పారు. 'గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజుల్లోపు బీమా సొమ్ము రూ.5లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం.. రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు అయింది.. కేంద్రం సాయం చేయకున్నా కడుపు కట్టుకుని అభివృద్ధి చేసుకున్నాం. కానీ, ప్రధాని నరేంద్రమోడీ విద్యుత్ సంస్కరణల పేరిట.. ప్రతి మోటార్కూ మీటరు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణం పోయినా మోటార్‌కు మీటరు పెట్టనివ్వను. రైతుల ధాన్యాన్ని మాత్రం కొనేది లేదంటున్నారు.. మరోవైపు డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు అడ్డగోలుగా పెంచారు. సాగు పెట్టుబడి ధరలు పెంచుతున్నారు. కేంద్రంపై తిరగబడదాం.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కొట్లాడతాం. ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వదు, వైద్య కళాశాలలు ఇవ్వదు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అందరం కొట్లాడతాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం. ఇది తెలంగాణ.. ఉడుత ఊపులకు భయపడేది లేదు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని టచ్ చేస్తే ఊరుకోం'' అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
కేంద్రంపై పోరాటం చేయాలే : మంత్రి దయాకర్‌రావు
కేంద్ర ప్రభుత్వంపై సీఎం పోరాటం చేయాలని, తమ వెంట మేముంటామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయాలని సీఎంను కోరారు. కొడకండ్లలో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. బమ్మెర, వల్మిడికి నిధులివ్వాలన్నారు. రాయపర్తి సన్నూరు వెంకటేశ్వరస్వామి దేవాలయం కింద వెయ్యి ఎకరాల భూమి వుందని, గిరిజన రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలివ్వాలని సీఎంను కోరారు.
తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గిరిజన సంక్షేమం మరియు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఒకప్పుడు జనగామ ఎడారిలా ఉండేదని, ఇప్పుడు.. పంటలు పండుతున్నాయన్నారు. సభలో చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మెన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.