Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్లకు మీటర్లు పెడతామని బీజేపీ ఎక్కడా చెప్పలేదు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేసీఆర్ అవినీతి సామాజ్య్ర పతనం ప్రారంభమైంది. తన అవినీతిపై విచారణ ప్రారంభమైందని తెలిసే ఆయనలో భయం మొదలైంది. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే కుట్ర చేస్తుండు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పడానికే సభ పెట్టినట్టు, తాగి మాట్లాడినట్టు ఉందని విమర్శించారు. బహిరంగ సభలో తాము డ్రంకెన్ డ్రైవ్ చేస్తామనీ, తాగినట్టు తేలితే నేతల్నీ జైలుకు పంపేలా ఓ స్కీం తెస్తామని చురకలంటించారు. బోర్లకు కరెంటు మీటర్లు పెడతామని బీజేపీ ఎక్కడా చెప్పలేదనీ, కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. డిస్కమ్‌లకు రూ.48 వేల కోట్ల అప్పు చెల్లించాలనీ, అవి కట్టకుండా, భవిష్యత్‌లో కరెంటు రాకపోతే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. డిస్కమ్‌లకు డబ్బులు కట్టకుండా తానే ఉచిత కరెంటు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించాక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలకు పూనుకోలేదని ప్రశ్నించారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, తదితర హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న కుటుంబాల వారుగానీ, ఉద్యమకారులుగానీ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారా? అని అడిగారు. ఈ సమావేశంలో బీజేపీపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సీహెచ్ విఠల్, ఉమారాణి, సంగప్ప, ఆలె భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ బజాజ్ మృతికి బండి సంతాపం
బజాజ్ గ్రూప్ మాజీ చైర్మెన్, పద్మభూషన్ రాహుల్ బజాజ్ మృతికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ సంతాపం తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో బజాజ్ స్కూటర్ తీసుకొచ్చి దేశ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కృషి చేశారని తెలిపారు. కొత్తగా వ్యాపారాల్లోకి వచ్చేవారికి ఆయన స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు.