Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు లైన్మెన్ మృతి
నవతెలంగాణ-ఆర్మూర్టౌన్
కరెంట్ సరఫరా కావడం లేదన్న ఫిర్యాదుతో మరమ్మతులు చేసేందుకు స్తంభం ఎక్కిన ప్రయివేటు లైన్మెన్.. కరెంట్షాక్తో స్తంభం మీదే ప్రాణం వదిలాడు. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో శనివారం జరిగింది. ఎస్ఐ రాజుభరత్రెడ్డి వివరాల ప్రకారం.. 37 ఎస్ఎస్ నంబర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి పంపులకు కరెంటు సరఫరా కావడం లేదని రైతులు చెప్పారు. దాంతో ప్రయివేట్ లైన్మెన్ బట్టు బాలయ్య(58) ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్తు ఆపేసి పైకి ఎక్కాడు. ట్రాన్స్ఫార్మర్కు కరెంటు సరఫరా ఇచ్చే ఇన్సులేటర్ ఒకటి విరిగి యథావిధిగా కరెంట్ సరఫరా అయింది. దాన్ని బాలయ్య గమనించకపోవడంతో విద్యుద్ఘాతానికి గురై ట్రాన్స్ఫార్మర్పైనే మృతిచెందాడు. సాయిబుపేట్, జానకంపేట్ గ్రామాల్లో సుమారు 45 ఏండ్లుగా విద్యుత్ సేవలందిస్తున్న ఆయన్ను కరెంట్ బాలయ్యగా పేరుబడింది. అలాంటి మంచి వ్యక్తి మృతిచెందడంతో రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. చిన్న కుమారుడు ఈనెల 18న ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ రాజు భరత్ రెడ్డి తెలిపారు.