Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం :డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-సిటీబ్యూరో
వస్త్రధారణ పేరుతో అమ్మాయిలను చదువుకు దూరం చేయడం దారుణమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అన్నాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు ఏ.విజరు కుమార్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడారు. కర్నాటక ఉడిపి ప్రాంతంలో వస్త్రధారణ పేరుతో ముస్లిం అమ్మాయిలను విద్యాసంస్థలకు రానివ్వకపోవడం దారుణమన్నారు. ఇది దేశ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. ఆర్టికల్-21 ప్రకారం మతం పేరుతో చదువులకు దూరం చేయడం నేరం అవుతుందన్నారు. వస్త్రధారణ ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందని.. అందుకే కాషాయ మూకలు అల్లరి సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఉడిపి ప్రాంతం మత సామరస్యానికి కేంద్రం అని, మద్వచారుడు దగ్గరి నుంచి పెజావార్ స్వామి వరకు హిందు, ముస్లింలు ఎంతో సామరస్యంగా మెలిగారని గుర్తుచేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అక్కడి శాంతి వాతావరణానికి విఘాతం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్త్రధారణనే అభ్యంతరమైతే రాజస్థానీ మహిళలు ముసుగు ధరించి ఉంటారనీ, నాగరిక కాలంలో నాగ సాధువులు, జైనులు దిగంబరులు నగంగా నడయాడుతుంటారని వారిని ఎవరూ ఏమీ అనడం లేదన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో అనేక ఆచార వ్యవహారాలు ఉంటాయి ఉన్నాయని, ఆదివాసీ, కోయ జాతులు పూర్తి బట్టలు వేసుకోకుండానే జీవిస్తారని అన్నారు. సిక్కులు ఎప్పుడూ తలపాగాలు ధరించి ఉంటారని, అది వారి జీవన విధానమని అన్నారు. వీటిన్నింటికి లేని అభ్యంతరం హిజాబ్‌కు చెప్పడం అన్యాయమని, దీనిని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఇలా ఒక మతం వారిని టార్గెట్ చేస్తూ ఆందోళనలు చేయడాన్ని ఖండించాలని యువతకు, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రవి, నగర నాయకులు దినేష్, మధు, శంకర్, అశోక్ రెడ్డి, పడాల శంకర్, అరవింద్, శశిధర్ పాల్గొన్నారు.