Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రాలో విలీనంతో అభివృద్ధికి దూరం
- ఎనిమిదేండ్లుగా వేడుకుంటున్నా పట్టని ప్రభుత్వాలు
- కనీస వసతులకూ నోచుకోక ఆదివాసీల అవస్థలు
- భద్రాచలం మండలం చిన్నాభిన్నమై కుంటుబడిన ప్రగతి
- తిరిగి తెలంగాణలో కలపాలని పెల్లుబికుతున్న నిరసనలు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 2014లో పోలవరం ముంపు పేరుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా విభజించింది. నాలుగు మండలాలు (చింతూరు, వీఆర్పురం, కూనవరం, ఎటపాక (నూతన మండలం), 278 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసింది. ఫలితంగా భద్రాచలానికి ఐదు కి.మీ లోపు ఉన్న ఐదూళ్లను కోల్పోవడంతో భద్రాద్రి అభివృద్ధి కుంటుబడింది. ముంపుతో సంబంధం లేని భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలు ఎటపాక (5000 జనాభా), పిచుకలపాడు (4,000), కన్నాయిగూడెం (5,000), పురుషోత్తపట్నం (6,000), గుండాల(3,000)ను ఏపీలో విలీనం చేశారు. ఈ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ఎనిమిదేండ్లుగా భద్రాద్రిలో ఉద్యమాలు కొనసాగుతున్నా యి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతి సందర్భంలోనూ ఈ పంచాయతీలను రాష్ట్రంలో విలీనం చేస్తారేమోనని ఎదురుచూస్తున్న ఆదివాసీల ఆశలు అడియాశలే అవుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్లోనూ మరోసారి నిరాశే ఎదురవడంతో మళ్లీ ఉద్యమాలు ఊపందుకున్నాయి.
సమస్య మీద సమస్య...
భద్రాచలం మండలంలోని 22 పంచాయతీల్లో ఒక్క మండల కేంద్రాన్ని మినహాయించి మిగిలిన అన్ని జీపీలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. భద్రాచలానికి కిలోమీటర్నర దూరంలోని ఎటపాకను మండల కేంద్రంగా ఎంపిక చేసి ఈ పంచాయతీలన్నింటినీ దానిలో కలిపారు. నాటి నుంచి భద్రాద్రితో పాటు పట్టణానికి ఐదారు కి.మీ దూరంలో ఉన్న ఐదు పంచాయతీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంతో విడదీయలేని బంధం ఉన్న ఆ ఐదు ఊళ్లతో పాటు భద్రాద్రి అభివృద్ధి, భౌగోళిక స్వరూపం చిన్నాభిన్నం అయ్యాయి. రామాలయానికి అతి సమీపంలో అత్యధిక భూములున్న పురుషోత్తపట్నం క్షేత్రానికి నాలుగు కి.మీ దూరంలోనే ఉంది. కిలోమీటర్నర దూరంలోని ఎటపాకను ఏపీలో కలిపారు. ఫలితంగా భద్రాచలానికి డంపింగ్ యార్డు సమస్య ఉత్పన్నమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎటపాక కేంద్రంగా ఏర్పాటు చేసిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను భద్రాద్రి కోల్పోయింది. స్థలాభావం కారణంగా భద్రాచలంలో కనీసం శ్మశాన వాటిక లేకుండా పోయింది. ఓ శవాన్ని ఖననం చేసిన చోటే మరో దాన్ని పూడ్చటం, కాల్చడం చేయాల్సి వస్తోంది. నాలుగు కి.మీ దూరంలోని గుండాలనూ ఏపీలో కలిపారు. రామాలయానికి అనుబంధంగా ఉన్న దుమ్ముగూడెం మండలం పర్ణశాల వెళ్లాంటే ఆంధ్రారోడ్డు మార్గం నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలి. తిరిగి తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించాలి. ఇప్పటికే లక్ష జనాభాకు చేరుకున్న భద్రాచలం అభివృద్ధి చెందాలంటే ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయడం మినహా మరోమార్గం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఆ ఐదు పంచాయతీలకూ 'కొత్త'చిక్కు
ఇప్పటికే అభివృద్ధి నోచుకోక అవస్థలు పడుతున్న ఆ ఐదు పంచాయతీలకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఐదూళ్లను పాడేరు కేంద్రంగా ఏర్పడే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపనున్నారు. ఒకవేళ అదే జరిగితే ఈ ఐదు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 380 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు 'పాడేరు వద్దు తెలంగాణ ముద్దు' అంటూ ఉద్యమం చేపట్టారు. 50 కి.మీ దూరంలో ఉన్న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తమను కలపాలని డిమాండ్ చేస్తున్నారు. దీని కోసమే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రహదారులను దిగ్బంధించారు. భద్రాచలంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు ఐదు పంచాయతీల ప్రజానీకం మద్దతు తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై ఈనెల 17న కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానుంది. ఈ సమావేశంలో విలీన గ్రామాల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఐదు పంచాయతీలను రాష్ట్రంలో కలిపే వరకూ ఉద్యమం
భద్రాచలంతో పాటు దానికి మూడు, నాలుగు కి.మీ దూరంలో ఉన్న ఐదు పంచాయతీలను నరేంద్రమోడీ ప్రభుత్వం అనాలో చితంగా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసింది. నాటి నుంచి ఇటు భద్రాచలం, అటు ఐదు పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అభివృద్ధి, రవాణ, పాలన, సౌకర్యాల పరంగా అనేక సమస్య లు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదేం డ్లుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాం. ఈ పంచాయ తీల విషయంలో టీఆర్ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోంది. ఆందోళనలకు మద్దతు తెలపడం మినహా సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. టీఆర్ఎస్ ఎంపీలు ఈ సమస్యపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలి. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం, ఎంపీలు తగిన చొరవ తీసుకోవాలని కోరుతున్నాం.
ఏజే రమేష్- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు