Authorization
Thu April 03, 2025 10:59:05 am
- మేడారం మహాజాతరలో ఆయనే కీలకం
- ప్రతిమలతో కాలినడకన 75 కిలోమీటర్లు పెనుక వంశీయుల ప్రయాణం
- అభివృద్ధికి దూరంగా పూనుగొండ్లలోని ఆలయం
- పెద్ద జాతరకు నిధులిస్తూ.. కీలక ఘట్టాన్ని మరుస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/కొత్తగూడ
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర గుర్తింపు పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు కోటి మందికిపైగా జనం వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లిస్తారు. ఈ జాతరలో సమ్మక్క భర్త పగిడిద్దరాజే కీలకం. ఆయన లేకుండా మేడారం మహాజాతరే లేదు. సమ్మక్క-సారలమ్మ జాతర అనంతరం తిరుగువారం సందర్భంగా పూనుగొండ్లలో పగిడిద్దరాజు జాతర నిర్వహించడం ఆనవాయితీ. కానీ అక్కడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలంలోని పూనుగొండ్ల పగిడిద్దరాజు స్వగ్రామం. గ్రామంలో రెండేండ్లకోసారి పగిడిద్దరాజు జాతర నిర్వహిస్తారు. పూనుగొండ్లలో జనాభా అతి తక్కువ. ఆలయ అభివృద్ధి, జాతర నిర్వహణను ప్రభుత్వం విస్మరించడంతో గ్రామస్తులు, పెనుక వంశీయులు ఇంటికి కొంత చందా వేసుకుంటున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో భాగంగా ఈనెల 16న కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును మేడారానికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈనెల 23 నుంచి 25 వరకు పగిడిద్దరాజు జాతర జరుగనుంది. పూనుగొండ్లలో పగిడిద్దరాజును ఆదివాసీలు, గిరిజనేతరులు పూజించి మొక్కులు చెల్లిస్తారు. ంండేండ్లకోసారి జరిగే పగిడిద్దరాజు జాతరతో ఏజెన్సీ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. పగిడిద్దరాజు ప్రతిమలను (పడిగెలను) పొనుగొండ్ల నుంచి పెనుక వంశీయులు తీసుకొస్తారు. గిరిజన సంప్రదాయాలతో..డప్పు వాయిద్యాల నడుమ. శివసత్తుల పూనకాలతో అటవీ మార్గంగుండా కర్లపెల్లి, లక్ష్మీపురం, ప్రాజెక్టు నగర్ మీదుగా దాదాపు 75 కిలోమీటర్లు కాలినడకన మేడారం చేరుకుని గద్దెలపై ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సంప్రదాయాల ప్రకారం ఎదురుకోళ్లు నిర్వహించి సమ్మక్కతో వివాహం జరిపిస్తారు. అయితే, పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు ఆలయానికి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. తాగునీటి, మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు స్నానపు గదులు, ఇతర కనీసం వసతులూ లేవు.
చలువ పందిళ్లు వేయించాలి
జాతరకు వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేయించాలి. పగిడిద్దరాజు తిరుగువారం జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి. అభివృద్ధి చేయాలి.
పెనుక బుచ్చిరాములు- ప్రధాన పూజారి
శాశ్వత నీటి సదుపాయం కల్పించాలి
పగిడిద్దరాజును తీసుకొచ్చేప్పు డు, మేడారానికి వెళ్లేప్పుడు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పూనుగొ ండ్లలోని పగిడిద్దరాజు జాతర ప్రాంగణంలో సెల్‌టవర్ ఏర్పాటు చేయాలి. శాశ్వత ప్రాతిపదికన తాగునీటి, ఇతర సదుపాయాలు కల్పించాలి.
పెనుక సురేందర్- ప్రధాన పూజారి
రూ.10 కోట్లు కేటాయించాలి
పగిడిద్దరాజు జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏటా రూ.10 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి మేడారం సమ్మక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న క్రమంలో పగిడిద్దరాజు జాతరను విస్మరించడం సరికాదు. పగిడిద్దరాజును మేడారానికి తరలించే కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కల్పించాలి. పగిడిద్దరాజు పూజారులకు దేవాదాయ శాఖ ద్వారా నెలవారీ వేతనాలు ఇవ్వాలి.
పెనుక పురుషోత్తం- ప్రధాన పూజారి