Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు
- క్షమాపణ చెప్పాలి : కాంగ్రెస్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీపై అసోం ముఖ్యమంత్రి హేమంత్‌శర్మ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. వెంటనే ఆయనను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, బీజేపీకి అమ్ముడు పోయారని విమర్శించింది. శనివారం హైదరాబాద్‌లోని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, మల్లురవి, మెట్టుసాయి వేర్వేరుగా విలేకర్లతో మాట్లాడారు. హేమంత్ వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ, బీజేపీ నేతలు దేశానికి క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. దేశ సంస్కృతికి విరుద్ధంగా అసోం సీఎం మాట్లాడారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి, కుసంస్కారం ఉన్న ఆ పార్టీ దేశాన్ని పాలించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం మెప్పుకోసమే రాహుల అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఆయన తల్లిదండ్రులెవరని మేము అడిగామా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా తక్షణమే స్పందించాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. మోడీ భార్య ఎందుకు సహజీవనంలో లేదంటూ కాంగ్రెస్ ఏనాడైనా ప్రశ్నించిందా? అని నిలదీశారు. ఇదిలా వుండగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో అసోం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో 'హిజాబ్ నా జన్మహక్కు' అనే పేరుతో సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ విద్యాసంస్థల్లో జరుగుతున్న మతోన్మాద శక్తులకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, అఫ్జలుద్దీన్, మహిళ కాంగ్రెస్ నాయకులు వరలక్ష్మి, పద్మ, కవిత తదితరులు మాట్లాడారు.