Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ, ప్రజానుకూల ప్రతిపాదనలపై మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్టు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. ఆ పిలుపును జయప్రదం చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన ఏఐకేఎస్, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బి.వెంకట్ మాట్లాడుతూ.. రూ.39 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందనీ, కార్పొరేట్లకు వరాలు కురిపించిందని విమర్శించారు. కరోనా థర్డ్‌వేవ్, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తమకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పారు. పేదల కొనుగోలు శక్తిని, వారి జీవన ప్రమాణాలను పెంచడానికి సబ్సిడీలను పెంచడానికి బదులు కార్పొరేట్, ప్రవేట్ పరిశ్రమల అధిపతులకు రాయితీలు పెంచారని విమర్శించారు. కార్పొరేట్ పన్నును 12శాతం నుంచి ఏడు శాతానికి, ప్రయివేటు పరిశ్రమల పన్ను 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ ప్రతిపాదనలు చేయడం దారుణమన్నారు. అదే సమయంలో నిరుపేదల ఆహార సబ్సిడీల కోసం గత బడ్జెట్లో రూ 2.86 లక్షల కోట్లు వెచ్చిస్తే ఈసారి వాటిని రూ 2.06 లక్షల కోట్లకు కుదించటం అన్యాయమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పన చట్టం గురించి నోరు విప్పని ప్రధాని నరేంద్ర మోడీ ఎరువులు పై ఇస్తున్న సబ్సిడీలను రూ 4380 కోట్లు తగ్గించారని విమర్శించారు. పెట్రోలు ఉత్పత్తుల సబ్సీడీలను రూ 100 కోట్లు కోత విధించారని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగులకు పని కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఊతమిస్తున్న జాతీయ గ్రామీలు ఉపాధి హామీ చట్టం పనులకూ గతేడాదితో పోలిస్తే రూ.25 వేల కోట్ల కోత పెట్టడం దారుణమని విమర్శించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సాయిబాలు, చుక్కా రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రసాద్, ఆర్. వెంకట్రాములు, సీఐటీయూ రాష్ట్ర నేతలు వీఎస్ రావు, వంగూరు రాములు, బి. మధు, నాయకులు శ్రీకాంత్, సుధాకర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.