Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 317 జీవోను తక్షణమే సవరించాలి...
- టీపీయుఎస్ నేతల డిమాండ్
- ఇందిరాపార్కు వద్ద ధర్నాకు యత్నం
- పోలీసుల అడ్డగింత, విడతల వారీగా అరెస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయుఎస్) డిమాండ్ చేసింది. జీవోనెం.317 జీవోను వెంటనే సవరించాలని ఆ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... టీపీయుఎస్ ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపారు వద్ద ధర్నా నిర్వహించేందుకు వందలాది మంది ఉపాధ్యాయులు వచ్చారు. అయితే ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డగించారు. అక్కడకు వచ్చిన టీచర్లను.. వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్టు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ఒక ఉపాధ్యాయురాలు స్పృహతప్పి పడిపోయారు. అరెస్టు చేసిన టీచర్లను నాంపల్లి, ముషీరాబాద్, నారాయణగూడ, చిక్కడపల్లి, రాంగోపాల్‌పేట, గాంధీనగర్, అబిడ్స్, బేగంపేట, బేగంబజార్ తదితర స్టేషన్లకు తరలించారు.
అంతకుముందు ఇందిరాపార్కు వద్దకు వచ్చిన టీచర్లనుద్దేశించి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ... 317 జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరక్కుండా చూడాలని కోరారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు అనుమతివ్వాలంటూ 15 రోజుల క్రితమే పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా అనుమతి లేదంటూ శుక్రవారం చెప్పటం శోచనీయమన్నారు. బదిలీల్లో వికలాంగులు, భార్యాభర్తల కేసులను పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు మాట్లాడుతూ... ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని కోరారు. 317 జీవోను సవరించటం ద్వారా పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. టీపీయుఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, మాజీ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, నాయకులు వెంకటరావు, ఉషారాణి, నరేందర్‌రావు తదితరులు ఉపాధ్యాయుల అరెస్టులను ఖండించారు.
ధర్నాచౌక్..నిర్మానుష్యం...
ఉపాధ్యాయుల ఆందోళనల నేపథ్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్ మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఈ ప్రాంతానికి రెండు వైపులా భారీ సంఖ్యలో పోలీసులను మొహరించి, బారికేడ్లు వేయటంతో వాహనాల రాకపోకలు బందయ్యాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ రోడ్డు బోసిపోయింది. జనం లేకపోవటంతో కొబ్బరి బోండాలు అమ్మేవారు, పండ్లు, కూరగాయల బండ్ల వారు, ఇతర చిరు వ్యాపారులు గిరాకీ లేక దిగాలుగా కూర్చున్నారు. ధర్నాలు చేయకుండా ప్రభుత్వం బంద్ పెట్టటంతో తమ గిరాకీపై పెద్ద దెబ్బ పడుతున్నదని కొబ్బరి బోండాలు అమ్ముకునే ఓ వృద్ధురాలు వాపోయింది.