Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
లాభాల్లో ఉన్న జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)ని షేర్ మార్కెట్లో పెట్టి అమ్మేసే ప్రక్రియను తక్షణం నిలుపుదల చేయాలని పలువురు వక్తలు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లు సంయుక్తంగా శనివారం వెబినార్ నిర్వహించాయి. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు అమానుల్లాఖాన్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఎల్ఐసీని అమ్మేయడం పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య అని అన్నారు. భారత జాతీయోద్యమ లక్ష్యాలను పూర్తి చేయడం కోసం ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని జాతీయం చేసినప్పటి నుంచీ అనేక వెనుకబడిన ప్రాంతాలలో విస్తరించి, ప్రజలకు బీమా సౌకర్యాన్ని కల్పించిన ఘనత ఎల్ఐసీదేనని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పనకై కావలసినన్ని నిధులు సమకూరుస్తున్నదని వివరించారు. ఎల్ఐసీలో ప్రభుత్వ పెట్టుబడి 1956లో కేవలం రూ.ఐదు కోట్లు మాత్రమేననీ, ఇప్పుడా సంస్థ రూ.5 లక్షల కోట్లకు పైబడి విలువను పెంచుకున్నదని తెలిపారు. కో-ఆపరేటివ్ వెంచర్‌గా ఎదిగిన సంస్థను ప్రభుత్వ రంగంలో కొనసాగించడమే శ్రేయస్కరమ న్నారు. వెబినార్‌కు అధీష్ రెడ్డి, శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రఘు, తిరుపతయ్య సంధానకర్తలుగా వ్యవహరించారు. గిరిధర్ వందన సమర్పణ చేశారు.