Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దాలైనా పూర్తిగా ఆగని వైనం
- పడకేసిన ప్రచార కార్యక్రమాలు
- తల్లులకు అవగాహన కల్పించని సొసైటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చికిత్స కన్నా నివారణ ప్రదానమైనదనేది నానుడి. రోగం వచ్చాక చికిత్స కోసం పరుగులు తీసేకన్నా ముందే రోగం రాకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. నివారించదగ్గ జబ్బుల నివారణకు ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఎక్కువగా ప్రచార కార్యక్రమాలపై ఆధారపడుతుంటాం. పల్స్ పోలియో మొదలు అనేక రోగాల నుంచి రాష్ట్రాన్ని కాపాడింది ముమ్మరంగా సాగిన ఇలాంటి అవగాహనా కార్యక్రమాలే. అదే క్రమంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆధునిక పరిశోధనల ఫలితాల పుణ్యమానీ ప్రసవించి హెచ్ఐవీ ఉన్న తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి రాకుండా ముందుగానే గుర్తించే అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో 2000 సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలై 22 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొంత మంది తల్లులకు హెచ్ఐవీతో పిల్లలు జన్మిస్తున్నారంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు 3,540 మంది చిన్నారులు హెచ్ఐవితో బాధపడుతున్నారు.
రోగుల పట్ల సమాజంలో నెలకొన్న వివక్ష కూడా ఇందుకు కారణంగా తెలుస్తున్నది. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ద్వారా రోగులకు యాంటీ రిట్రో వైరల్ ద్వారా మందులతో సహాయం చేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు 83 వేల మంది రోగులు ఈ సెంటర్ల వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో కొంత మంది మందులను ఆపేసినప్పటికీ గుర్తించలేని పరిస్థితి నెలకొన్నది. సేవలందుకునేందుకు కొంత మంది ఇచ్చిన చిరునామా, ఫోన్ నెంబర్ సరిగా లేకపోవడంతో అలాంటి వారు ఎక్కడికెళ్లారో కూడా తెలియని పరిస్థితి. తెలంగాణ డయాగస్టిక్ సెంటర్లో పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి చేసిన ఎయిడ్స్ రోగుల పట్ల గోప్యత కాపాడటం కోసం మినహాయింపునిచ్చింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇదే గోప్యత కొంత మంది క్రమం తప్పకుండా మందులు వేసుకోకున్నా వారిని ట్రేస్ చేయడానికి వీలు లేకుండా చేస్తున్నది. దీనికి సజీవ ఉదాహరణ ఒకటి హైదరాబాద్లోని ఒక ఆస్పత్రిలో బయటపడింది. అప్పటికే వేరే చోట ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్న మహిళ అక్కడ్నుంచి మాయమై వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. గర్భం దాల్చింది. ఆ సమయంలో చేసిన టెస్టులతో ఆమె హెచ్ఐవి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో అక్కడి సిబ్బంది పుట్టబోయే బిడ్డకు ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.
ప్రచారమేది?
గతంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ గురించి విస్తృతంగా ప్రచారం జరిగేది. టీవీలు, థియేటర్లతో పాటు వీధి నాటకాలు తదితర రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించేది. గత కొంత కాలంగా ఇలాంటి ప్రచారం నామమాత్రంగా మారింది. దీంతో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తునే ఉన్నాయి. ముఖ్యంగా నిరక్షరాస్యులు ఎక్కువగా బలవుతున్నట్టు తెలుస్తున్నది. నియంత్రణ మండలి తిరిగి కార్యక్రమాలను ఉధృతం చేయాలని పలువురు కోరుతున్నారు.