Authorization
Thu April 03, 2025 12:02:16 pm
- ఉద్యోగాలను వదిలేస్తున్న సిబ్బంది
- డిప్యూటేషన్ క్యాన్సల్ చేసుకుంటున్న వైనం
- ఖర్చులు చెప్పకున్నా ...ఎన్జీవోలకు నిధుల విడుదల
- నియంత్రణ తప్పిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రాన్ని హెచ్ఐవీ రహితంగా, ఎయిడ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ఏర్పడిన రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నియంత్రణ తప్పింది. పని చేసే వాతావరణం లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, ఉద్యోగాలు తమ మాతశాఖలోకి తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ పని చేయలేమంటూ ఏకంగా రాజీనామా చేసి ప్రయివేటు ఉద్యోగాలకు వెళ్తున్నారు. స్వచ్ఛంద సంస్థలను పర్యవేక్షించే పోస్టులో ఉన్న ఒక ఉద్యోగి అక్కడి అధికారిణి ఒకరి వేధింపులు భరించలేక ఇటీవల రాజీనామా చేసి ప్రయివేటు సంస్థలో చేరినట్టు సమాచారం. అంతా తాను చెప్పినట్టుగానే వినాలంటూ ఇష్టారాజ్యంగా ఆ అధికారిణి వ్యవహార శైలి నచ్చకే ఈ పరిస్థితి నెలకొన్నది. దీనికి తోడు తరచూ వ్యక్తిగత దూషణలు, కించపరిచినట్టుగా మాట్లాడటం, సహౌద్యోగులనే భావన లేకుండా బానిసలుగా చూస్తున్న తీరు పట్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ మండలికి సహకరిస్తూ రాష్ట్రంలో దాదాపు 50 స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. వీటి కోసం ప్రతి నెల ఒక కోటి 25 లక్షల రూపాయలను విడుదల చేస్తుంటారు. వీటిని ఆయా కార్యక్రమాల కోసం వినియోగించిన తర్వాత ఆయా ఎన్జీవోలు యుటిలైజేషన్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే సకాలంలో సర్టిఫికేట్లను సమర్పించకపోయినా సదరు అధికారి నిధులను విడుదల చేయడాన్ని సంబంధిత సిబ్బంది ఒకరు వ్యతిరేకించారు. కనీసం 70 శాతం నుంచి 80 శాతం వరకు ఖర్చు చేస్తే తదపరి నిధులు విడుదల చేయాలని సూచించారు. రూ.7 కోట్లు విడుదల చేసిన కేవలం రూ.2 కోట్లకే యుటిలైజేషన్ సర్టిఫికేట్లు వచ్చాయని తెలుస్తున్నది. అలాంటి సందర్భంలో నిధులు తాత్కాలికంగా ఆపేస్తే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో)కు సమాధానం చెప్పుకునేందుకు వీలుంటుందని సిబ్బంది వాదించినట్టు తెలిసింది. దీంతో ఆగ్రహానికి గురైన అధికారి అంతా నాకు తెలుసు... యుటిలైజేషన్ సర్టిఫికేట్లు లేకున్నా నిధులు విడుదల చేయాలని హుకూం జారీ చేయడంతో ఆందోళనకు గురై ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలుస్తున్నది. ఎన్జీవోలతో కలిసి అవినీతికి పాల్పడేందుకు తొమ్మిదేండ్ల సర్వీసు ఉన్న ఉద్యోగి రాజీనామా చేసి వెళ్లేలా వేధించారని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఆమె చెబితే శాసనమే....
ఆ సొసైటీ అంతా ఆమె చెప్పినట్టుగానే నడవాలి. ఎయిడ్స్ నియంత్రణ కోసం సొసైటీలో ఉన్న ఆయా విభాగాలకు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో అధికారులు పర్యవేక్షించే వారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోనే ఆయా విభాగాల్లో పని చేస్తున్న వారిని డిప్యూటేషన్ పై ఈ పోస్టుల్లో నింపేవారు. అయితే ఎన్జీవోలను పర్యవేక్షించేందుకు టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (టీఐ) జేడీ, 58 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్స్ (ఐసీటీసీ) పర్యవేక్షించే జేడీ, కేస్ అండ్ సపోర్ట్ సెంటర్లను (సీఎస్ టీ) చూసే జాయింట్ డైరెక్టర్, సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ డిసీజెస్ (ఎస్టీడీ) విభాగానికి జేడీ లేదా డీడీ పోస్టుల్లో విధులు నిర్వహించే వారంతా వరసగా వెళ్లిపోయారు. ఇదంతా కేవలం ఆమె పెట్టే వేధింపులు భరించలేకే జరుగుతున్నదనే గుసగుసలు వినపడుతున్నాయి. కేవలం రెండేండ్ల కోసం ఫారీన్ సర్వీస్ డిప్యూటేషన్ పై వచ్చిన ఆ అధికారి నాలుగేండ్లైనా కదలడం లేదు.