Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణకు ''రాజ్యాంగ పరిరక్షణ ఐక్య వేదిక'' పేరుతో ఐక్యపోరాటం చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో లక్షలాది మందితో యుద్ధభేరి మోగించాలని తీర్మానించారు. వేదిక సమావేశం ఈ నెల 15న జరగనున్నదనీ, అందులో తమ కార్యాచరణ, కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో మహాజన సోషలిస్టుపార్టీ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండ రామ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్యనాయక్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిళ, సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, ప్రొఫెసర్ హరగోపాల్, దళిత హక్కుల నేత జేబీ రాజుతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, కేసీఆర్ ఓడించాలంటే బీజేపీ, కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలూ ఐక్య ఉద్యమానికి రావాలని కోరారు. బీజేపీ నుంచి ప్రధాని, కేంద్ర మంత్రి అమిత్ షాను, జాతీయ అధ్యక్షుడు నడ్డాను, కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీనైనా, రాహుల్ నైనా ఆహ్వానించాలని ఆయా పార్టీల నేతలకు సూచించారు. కేసీఆర్ ను ఓడించే క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల కోసం ఒక వేదికను పంచుకుంటే తప్పు ఏముందని ప్రశ్నించారు. ''రాజ్యాంగ పరిరక్షణ వేదిక'' ద్వారా ఉద్యమిస్తామన్నారు. కేసీఆర్ ను రాజకీయంగా సమాధి చేయాలన్నారు.ఈ నెల16న, మహిళా సంఘాలను,17న మేధావులను, ఆ తర్వాత కుల సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
కోదండరామ్ మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దనీ, నిరంకుశ పాలనపై పోరాటం చేద్దామన్నారు. బండి సంజరు మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రాజ్యాంగం కావాలా ?, అంబెద్కర్ రాజ్యాంగం కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.. వై.ఎస్ షర్మిళ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకోవడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన రావడమే దుర్మార్గపు ఆలోచన అని అన్నారు.