Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్, డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ- అంబర్‌పేట
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, అందుకోసం హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే ఆ విధమైన సేవలు కొనసాగుతున్నాయన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉందని స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రే చెప్పారన్నారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇండ్లకు తరలించేందుకు అంబులెన్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. అందుకోసం తమవంతు సామాజిక బాధ్యతగా అంబులెన్స్‌లు ఇచ్చిన సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓపీ బ్లాక్, డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మార్చురీల అభివద్ధికి రూ.60 లక్షలు, డయాలసిస్ విభాగానికి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది చాలా కష్టపడ్డారని, వారి కృషి ఎనలేనిదని ప్రశంసించారు. థర్డ్‌వేవ్‌ను సమర్థవం తంగా ఎదుర్కొన్నామన్నారు. ఫీవర్ సర్వే ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, కరోనాను నివారించగలిగామని తెలిపారు. ఆస్పత్రిలో ఓపీ బ్లాక్ నిర్మాణానికి రూ.11 కోట్లు కేటాయించామని, గడ్డి అన్నారంలో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. నిమ్స్‌లో మరో 1000 నుంచి 1500 పడకల కొత్త బ్లాక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేష్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్, కార్పొరేటర్లు వై.అమృత, దూసరి శ్రీనివాస్‌గౌడ్, ఇ.విజరు కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
కాన్వారును అడ్డుకున్న యూత్ కాంగ్రెస్
ఫీవర్ ఆస్పత్రికి వస్తున్న సమయంలో మంత్రి హరీశ్‌రావు కాన్వారును యువజన కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ శిరీషా యాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, మోర శ్రీరాముల ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు భీష్మ, సిద్ధార్థ్ ముదిరాజ్, మేడి ప్రసాద్, చందు, మధుసూదన్ రెడ్డి, అనిల్, సంతోష్, భరత్, తదితర నాయకులు పాల్గొన్నారు.