Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన ఊరు-మన బడి'ని ఉద్యమ స్ఫూర్తిగా తీసుకోవాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుంచి మనఊరు - మనబడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తొలి విడతగా మూడో వంతు పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా 60 శాతం మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం అమలైన బడుల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు, లాబరేటరీ, లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నీచర్, డిజిటల్ విద్యా బోధనకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. తొలి దశలో 3497 కోట్ల రూపాయలతో 9123 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ బడులను సందర్శించాలని కలెక్టర్లకు సూచించారు.అత్యధికంగా 790 మంది మొదలుకుని వంద మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠాశాలలను తొలి విడత జాబితాలో ఎంపిక చేయాలన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ ద్వారా అభివృద్ధి పనులకు నిధులు ఖర్చు చేయాలని, ఎస్ఎంసీ చైర్మెన్లతో పాటు సర్పంచ్, ప్రధానోపాధ్యాయుడు, ఇంజినీరింగ్ విభాగం ఏ.ఈ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మెన్లతో పాటు జడ్పీటీసీలు, గ్రంథాలయాల చైర్మెన్లు తదితర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని సూచించారు. విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చే ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు, ఇతర దాతలను ప్రోత్సహించాలని, వారి ఆర్థిక సహకారంతో బడులను మరింతగా అభివృద్ధి చేసుకోగల్గుతామన్నారు. ఎవరైనా పాఠశాలకు రూ.పది లక్షలు విరాళం ఇస్తే.. తరగతి గదికి వారి పేరు పెట్టొచ్చని, 25 లక్షలు విరాళం అందిస్తే ఓ విభాగం మొత్తానికి వారి పేరు పెట్టాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ మాట్లాడుతూ.. మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, పనులను గ్రౌండింగ్ చేసే సమయానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, సన్నద్ధమై ఉంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్, కమిషనర్ దేవసేన, జడ్పీ చైర్మెన్ అనిత హరనాథ్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జడ్పీ సీఈఓ దీలిప్ కుమార్ పాల్గొన్నారు.