Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశం సర్వనాశనం
- మోడీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి
- 15 లక్షల పరిశ్రమలు మూతపడ్డది నిజం కాదా ?..
- బెదిరిస్తే... కేసీఆర్ భయపడతాడా?
- రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలు మీ సంస్కారమా..
- భువనగిరి బహిరంగ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి/ యాదాద్రి/ భువనగిరి రూరల్
''దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు చెప్పుకుంటున్న మోడీకి సిగ్గుండాలి.. ఏం రంగంలో అభివృద్ధి చేశావు.. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేశారు.. 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డది నిజం కాదా.. ఆకలితో అలమటిస్తున్న 115దేశాలను సర్వే చేస్తే మన దేశం 101స్థానంలో ఉన్న సంగతి అబద్ధమా.. బెదిరిస్తే.. కేసీఆర్ భయపడతాడా..?'' అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రెసిడెన్షిల్ సూట్‌ను, కలెక్టరేట్ కార్యాలయ భవనం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పదిహేను లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, తద్వారా కోట్లాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పత్తులు బాగా తగ్గాయని, దానికి కారణం ఎవరో దమ్మున్న బీజేపీ మొగోడు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నీటి వాడకం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నామన్నారు. భారతదేశంలో 65 టీఎంసీల నీరు ఉంటే 35 వేల టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నామన్నారు. కేంద్రం విద్యుత్ సంస్కరణలు తెచ్చి.. రాష్ట్రాలు అమలు చేస్తేనే నిధులిస్తాం.. బావుల మోటార్లకు మీటర్లు బిగించాలంటోంది.. ఎట్టి పరిస్థితిల్లోనూ మీటర్లను బిగించబోనీయమన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఏడాది పాటు రైతులను ఏడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడంతోపాటు ప్రధాని మోడీ అన్నదాతలకు బహిరంగ క్షమాపణ చెప్పారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పిచ్చి ముదిరి పిచ్చి పిచ్చి చట్టాలు తెస్తోందని విమర్శించారు. ఈ విషయాలు మాట్లాడితే.. ''కేసీఆర్ నీ సంగతి చూస్తాం అని బెదిరిస్తున్నారు.. ఏం చూస్తారు నా సంగతి.. కేసీఆర్ భయపడేటోడు కాదు.. భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా'' అని ప్రశ్నించారు.
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు..
శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయని కేసీఆర్ అన్నారు. దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు.. కర్నాటకలో విద్యార్థినులపై రాక్షసంగా ప్రవర్తిస్తారా? సాఫ్ట్వేర్ రంగానికి ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. సిలికాన్ వ్యాలీని కాశ్మీర్ వ్యాలీగా మారిస్తే పెట్టుబడులు ఎవరు పెడతారు? దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా? 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో మత విద్వేషంతో ఎవరి కడుపు నిండుతుంది. మోడీ పాలనలో ఇప్పటికే దేశం నష్టపోయింది. రాజకీయంగా స్పందించకపోతే దేశం నాశనమైతుంది. జాతీయ పార్టీ నేత.. ఎంపీ రాహుల్‌ను ఉద్దేశించి అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు నన్ను కలచివేశాయి. రాహుల్ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారు. అలాంటి వ్యక్తిని ''ఏ అయ్యకు పుట్టారని మేము ఎప్పుడైనా అడిగామా'' అంటూ అస్సాం సీఎం వ్యాఖ్యానించడం బీజేపీ సభ్యతా సంస్కారమా? ఆ ముఖ్యమంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి'' అని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పోరాడే శక్తి సామర్థ్యం ఉందని, వారిచ్చే బలంతోనే ఢిల్లీ కోటను బద్దలు కొడతామన్నారు. ఢిల్లీలో ప్రగతిశీల ప్రభుత్వముంటే రాష్ట్రాలు అభివద్ధి చెందుతాయన్నారు. అందుకోసం తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడమన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ బీజేపీ.. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే.. దేశానికి అంత మంచిది. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో దాని భాగోతం చెబుతా.. అని సీఎం కేసీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగడి సునీత, జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్ పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా
ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరి పర్యటన సందర్భంగా బస్వాపురం ప్రాజెక్టు ముంపు బాధితులు, సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ భువనగిరిరూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహా, గడ్డం వెంకటేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.