Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడు సమతా, సమానత్వం అర్థమవుతాయి
- రాందేవ్‌బాబాకు రాఘవులు సలహా
- మనువాదాన్ని తేవటమే మీ ధర్మమా?
- ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదు
- ప్రజాసమస్యలను పరిష్కరించటంలో కేసీఆర్ విఫలం : తమ్మినేని
- సీపీఐ(ఎం) అఖిల భారత ముసాయిదా రాజకీయ తీర్మానం విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వామపక్ష నాయకులు ముచ్చింతల్‌లోని సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించాలంటూ యోగా గురువు రాందేవ్‌బాబా వ్యాఖ్యానించారనీ, అయితే ముందుగా రాందేవ్‌బాబా దేశంలోని దళిత వాడలు, గిరిజన గూడేలను సందర్శించాలంటూ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సూచించారు. అలా చేస్తే మన దేశంలో ఎస్సీ, ఎస్టీల పట్ల సమతా, సమన్యాయాలు ఎలా అమలవుతున్నాయో ఆయనకు అర్థమవుతాయని చురకలంటించారు. ఆయన యోగా గురువు కాబట్టి ..ఆ సబ్జెక్టు గురించే మాట్లాడితే బాగుండేదనీ, సమానత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశంలోని దళితులు, గిరిజనులు వెనుకబడిన తరగతుల ప్రజలు వివక్షతో ఎన్ని రకాల వేధింపులు, వేదనకు గురవుతున్నారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. సనాతన ధర్మమంటే ఏ ధర్మమని రాఘవులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆ పేరుతో మనువాదాన్ని తెస్తారా? అని ప్రశ్నించారు. కుల వ్యవస్థ న్యాయమైంది, ఆడవాళ్లు వంటింటికి , పిల్లలనుకనడానికి మాత్రమే పరిమితం కావాలని చెబుతారా? అని నిలదీశారు. రామానుజుడి సమానత్వ ధర్మాన్ని పాతిపెట్టి దాని స్థానంలో మనువాదం తీసుకురావటమే వారి ఉద్దేశమని చెప్పారు. నిజమైన సమానత్వం దేవుడి దగ్గర కాదు..మనుషుల దగ్గర ఉండాలని సూచించారు. దేశంలో అంతరాలు, అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములుతో కలిసి రాఘవులు మాట్లాడారు. సీపీఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని వారు విడుదల చేశారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెఢరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) రాజకీయ విధానంపై అత్యంత ప్రజాస్వామికంగా పార్టీలోనూ, బైటకూడా చర్చ జరుగుతుందని చెప్పారు. సభ్యులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు తమ అభిప్రాయాలు తెలపొచ్చని అన్నారు. ఏప్రిల్ 6-10వరకు కేరళ లోని కన్నూరులో జరగనున్న జాతీయ మహాసభల్లో ముసాయిదాకు చేర్పులు మార్పులు చేసి తుది రూపమిస్తామని వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లనన్నింటినీ లోన్రూపంలోనూ, వాటిని వడ్డీ లేని రుణాలుగానూ ఇస్తున్నారని చెప్పారు. ఇదో గొప్ప ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు 0.5శాతం అప్పులు చేయాలంటే..విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మీటర్లు పెట్టం, విద్యుత్ సంస్కరణలు అమలు చేయమని చెబుతున్నారనీ, ఇది ఆహ్వానించాల్సిన విషయమేనన్నారు. రూ. 35వేల కోట్ల మేర ఎరువుల సబ్సిడీని తగ్గించారని చెప్పారు. అంతర్జాతీయంగా వాటి ధరలు పెరిగిపోతున్నాయని తెలిపారు. రాబోయే కాలంలో రసాయినక ఎరువుల ధరలు పెరిగే అవకాశముందన్నారు. కానీ..ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు పెంచాల్సిందిపోయి తగ్గించటమేంటని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అందుకే ధాన్యాన్ని పండించొద్దని చెప్పారని గుర్తుచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఒక్కరు మాట్లాడితే సరిపోదనీ, ప్రజామద్దతు కూడగట్టాలని సూచించారు.తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలను పరిష్కరించటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ఈ విషయంలో కావాలనే పక్షపాత ధోరణితో కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించటంలో, నిలదీయటంలో విఫలమయ్యారన్నారు. బీజేపీ పట్ల, దాని విధానాల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. అయితే కేసీఆర్ ఒక్కరే కేకలు పెడితే సరిపోదనీ, ప్రజా మద్దతు కూడగట్టాల్సిన అవసరముందని సూచించారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. అదే క్రమంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పరిష్కరిస్తామంటూ చట్టసభల్లో చెప్పిన మాటల్ని కేసీఆర్ తిరిగి తుంగలో తొక్కుతున్నారని వివరించారు. పోడు భూముల సమస్యను తామే పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. దరఖాస్తులు తీసుకున్నా..వాటిని నేటికీ పరిశీలించలేదనీ, పోడు రైతులను తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం వల్లే బీజేపీ ఇక్కడ పాగా వేసేందుకు కలలు కంటున్నదని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు ఆ పార్టీ కుట్రలు పన్నుతున్నదని విమర్శించారు.