Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు నమోదు చేయకుంటే ఎల్లుండి ధర్నాలు :కాంగ్రెస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ ఖండించింది. ఆదివారం గాంధీభవన్‌లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మూడున్నర గంటల పాటు జరిగింది. అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ అసోం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామనీ, కేసు నమోదు చేయకుంటే మంగళవారం పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో కలిసి తాను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. 18న మహిళా నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో 32 లక్షల డిజిటల్ సభ్యత్వ నమోదు చేశామన్నారు. 50 లక్షల డిజిటల్ సభ్యత్వాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మెన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర తెలియకున్నా ప్రధాని మోడీ అంతా తెలిసినట్టు పార్లమెంటులో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణను ఆంధ్రలో తిరిగి కలుపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
నేడు నిరసన
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ ఓబిసి విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి ఆరడుగుల రాజ్యాంగ ప్రతిని సమర్పించనున్నట్టు ఆ విభాగం చైర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
నేడు రేవంత్ ఫిర్యాదు
సోమవారం ఉదయం 11 గంటలకు టీపీసీసీ అధ్యక్షులురేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, పలువురు ముఖ్య నాయకులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై ఫిర్యాదు చేయనున్నారు.