Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి పనితీరు అభినందనీయం
- కరోనా కట్టడికి ఫీవర్ సర్వే ఎంతో ఉపయోగపడింది :మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్(రాజంపేట్)
కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో వైద్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్ల కృషి మరువలేనిదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వారు ఆశా వర్కర్లు కాదని, ఆరాధ్య దైవాలని కొనియాడారు. అందుకే వారి వేతనాలను రూ.1500 నుంచి రూ.9750 సీఎం కేసీఆర్ పెంచారని చెప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాలైన ఉత్తరప్రదేశ్‌లో రూ.4వేలు, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాజస్తాన్‌లో సైతం వారికి రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. గత పాలకులు మూడు నాలుగు నెలలకోసారి వేతనాలు వేసేవారని, ప్రస్తుతం ఒకటో తేదీనే పడుతున్నట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు ఆదివారం పర్యటించారు, జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిని ప్రారంభించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి సందర్శించారు. అధికారులతో మాట్లాడుతూ.. నాణ్యత లోపం లేకుండా ఆస్పత్రి నిర్మించాలని సూచించారు. తదనంతరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్ పంపిణీని కామారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనిచేసేవారిని కడుపులో పెట్టుకుంటామనీ, పని చేయలేని వారిని సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మెరుగైన వైద్య విధానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశాలకు మొబైల్ ఫోన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. వైద్య రంగంలో విశిష్ట సేవలకు గాను జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లాకు కాయాకల్ప అవార్డు రావడం చాలా సంతోషమన్నారు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందనీ, దాన్ని మెరుగు పరుచుకోవడానికి సిబ్బంది పట్టుదలతో పని చేయాలని సూచించారు. డెలివరీ కేసులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు వందలు మాత్రమే అవుతున్నాయనీ, అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని ప్రజలు ఎందుకు పట్టించుకోవడం లేదో పరిశీలించి, లోపం ఎక్కడ జరుగుతుందో సరిచేసుకోవాలని తెలిపారు. జిల్లాలో మొదటి డోస్ వంద శాతం పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డిని టీబీ రహిత జిల్లాగా మార్చాలని దీనికి అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్ గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు వంద పడకల ఆస్పత్రికి అదనంగా రూ.10 లక్షలు ప్రకటించారు. అదే విధంగా మరో 150 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని గోవర్ధన్ సూచనల మేరకు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ కరుణ, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, విప్ గంపగోవర్దన్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, సురేందర్, డీసీసీబీ చైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మెన్ హిందూ ప్రియ తదితరులు పాల్గొన్నారు.