Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురపాలక, పట్టణాభివృద్ధి,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
- ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఆదివారం ఉప్పల్‌లో జెన్ ప్యాక్ట్ విస్తరణకు మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ చుట్టుపక్కల ఐటీ బాగా విస్తరించిందని, జెన్పాక్ట్ సంస్థ హైదరాబాద్ నలుదిశలా 20 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సంస్థల్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష మంది ఐటీ ఉద్యోగులకు వసతి కల్పించేలా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపొందిస్తున్నామని తెలిపారు. తూర్పు ప్రాంత అభివృద్ధి కోసం నాగోల్‌లో శిల్పారామం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉందని చెప్పారు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు, ఉప్పల్ జంక్షన్‌లోనూ స్కైవాక్ నిర్మాణం జరుగుతోందన్నారు. పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతోందని అన్నారు. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. జెన్‌ప్యాక్ట్ వరంగల్లోనూ విస్తరిస్తున్నందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రామ్కీ ఎన్విరో మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.