Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాడభూషి శ్రీధర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని కేంద్ర సమాచార కమిషన్ మాజీ చైర్మెన్ మాడభూషి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణా డెవలప్ మెంట్ ఫోరమ్, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో కృష్ణా జలాల్లో మన వాటా ఎంత అనే అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకుంటున్నదని చెప్పారు. అంతర్రాష్ట్ర జలాల కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో జల వివాదాలు ఏర్పడితే సుప్రీం కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్టు నీటిలో అన్యాయం జరుగుతుందనే భావనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా తేల్చాలని అడుగుతూనే ఉన్నామని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం కొత్త ట్రిబ్యునల్ వేయలేదన్నారు. ఇదే సమయంలో అనేక ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హౌదా ఇస్తున్నదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యంగ, రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేశారు.
''ఏపీ పునర్విభజనకు చట్టం సెక్షన్ 87లో నదుల మీద ప్రాజెక్టుల పరీక్షించడానికి రివర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఉన్నది. గెజిట్ నోటిఫికేషన్ కారణంగా రాష్ట్రాల విధులు, అధికారాలు, నిధులు, సిబ్బంది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్తాయి. అందువల్ల గెజిట్ నోటిఫికేషన్లను ఉపసంహరించుకోవాలి. పోరాడి సాధించిన తెలంగాణకు గెజిట్ నోటిఫికేషన్ పూర్తిగా వ్యతిరేకం .... '' అని మాడభూషి తెలిపారు.
రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గెజిట్ నోటిఫికేషన్ కావాలని ఆంధ్రప్రదేశ్ అడిగితే తెలంగాణ వ్యతిరేకించిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గెజిట్ నోటిఫికేషన్‌ను ఆపగలిగామని గుర్తుచేశారు. కర్ణాటక, మహారాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్‌ను ఆమోదిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించిందని చెప్పారు.కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ ఉన్న పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టును ఆపాల్సిన పరిస్థితి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఎన్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపేస్తే నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ కారణంగా తొమ్మిది ప్రాజెక్టులు ఆగిపోతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మెన్ రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.