Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఈఈఏ అధ్యక్షులు ఎన్ శివాజీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు-2021ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అడ్డుకుని తీరతామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శివాజీ స్పష్టం చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ బిల్లుపై చేసిన కామెంట్స్‌తో తమకు కొండంత బలం వచ్చిందనీ, ఇక కేంద్రంతో ప్రత్యక్ష యుద్ధమే చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపిందనీ, 13 రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాసాయని గుర్తుచేశారు. సోలార్ పవర్ టార్గెట్‌ను ఏకంగా 500 గిగావాట్లకు పెంచి, అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. బొగ్గు ధరలు, రైల్వే రవాణా చార్జీలను పెంచి, ఇంధన రేట్లను ఎలా అదుపులోకి తెస్తారని ప్రశ్నించారు. కార్పొరేట్లకు మేలు చేయడం కోసం రెనవబుల్ ఎనర్జీ లక్ష్యాలను విధించి, భారీగా అపరాధరుసుంలు విధిస్తూ విద్యుత్‌బిల్లును రూపొందించారని వివరించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో విద్యుత్‌రంగంలో అతి తక్కువ కాలంలో ప్రగతిని సాధించామని తెలిపారు. రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ చట్టం-2021పై ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలురూపాల్లో ఆందోళనలు చేస్తున్నట్టు శివాజీ చెప్పారు. టీఈఈఏ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి, తుల్జారాంసింగ్, సురేందర్‌రెడ్డి, బందెలరవి, శ్రవణ్‌కుమార్ గుప్తా, వెంకట్రామయ్య, నర్సింహారెడ్డి తదితరులు పత్రికా ప్రకటనలో సంతకాలు చేశారు.
సీఎంకు థ్యాంక్స్ టీఎస్‌పీఈఏ ప్రకటన
కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2021ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ మరోసారి వ్యాఖ్యలు చేయడాన్ని పట్ల తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) స్వాగతించింది. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి రత్నాకరరావు, పి సదానందం, అసోసియేట్ ప్రెసిడెంట్ ఏ వెంకటనారాయణ రెడ్డి, అడిషనల్ సెక్రటరీ జనరల్ కే అంజయ్య ఆదివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌రంగ విజయాలను వివరించారు. తక్షణం కేంద్రప్రభుత్వం ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.