Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిపిల్లలు రక్తహీనతతో ఉంటే మీకు పట్టదా...?
- మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ
- నేడు కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు మాడ్చేందుకే ఆహార భద్రతా చట్టాన్ని నీరుగారుస్తున్నదని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. పౌష్టికాహారలోపం వల్ల పసిపిల్లలు రక్తహీనతతో బాధపడుతుంటే సర్కారుకు పట్టటం లేదని ఆమె అన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాదిరిగా చౌక ధరల దుకాణాల్లో 14 రకాల వస్తువులివ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలనీ, దాన్ని పట్టణాలకు విస్తరించాలని కోరారు. కూలిని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇవే అంశాలపై ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా కూలీల రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి.
వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు బి.ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ నేతలు వెదిలి పద్మ, సుజాత, స్వరూప, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పని పద్మ మాట్లాడుతూ... మోడీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో ఉపాధి, ఉద్యోగాలు ఊడిపోయాయని అన్నారు. దీంతో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని తెలిపారు. మరోవైపు వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల కూలీలకు పనుల్లేకుండా పోయాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో పల్లెటూళ్లలో ఉపాధి పని దినాలను పెంచాలనీ, దాన్ని పట్టణాలకు కూడా విస్తరించాలనే డిమాండ్లు వస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలనివ్వాలనీ, స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలనీ, ఉపాధి పనుల దగ్గర పసి పిల్లలకు రక్షణగా ఆయాలను ఉంచాలనీ కోరారు. గర్భిణీలకు ఉపాధి హామీ కార్డు ఉంటే... వారికి అలవెన్సును ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకట్రాములు మాట్లాడుతూ... ఇలాంటి అంశాలన్నింటిపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. వాటిని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్... పేదలు, మధ్యతరగతి వారికి ఎంతమాత్రమూ ఉపయోగపడే విధంగా లేదని అన్నారు. దాంట్లో పలు సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న నిర్వహించబోయే ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.