Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు
- మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-ములుగు/తాడ్వాయి
రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారానికి వచ్చే సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి భారీగా నిధులు కేటాయించడంతోపాటు ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందని చెప్పారు. ములుగు జిల్లాలోని మేడారంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడారు. మేడారానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి జనం భారీగా వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహాజాతరకు ఉన్న ప్రాధాన్యత, ఆదివాసీల మనోభావాలను గుర్తించి ముందస్తుగానే భారీగా నిధులు కేటాయించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టిందని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతోపాటు రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, ఇతర పలు ప్రభుత్వ శాఖల అధికారులు మేడారంలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత పటిష్టంగా, ప్రణాళికాయుతం గా అధికారులు పని చేసేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పారిశుధ్య, ఇతర పనులను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. సందర్శకులకు అవసరమైన వైద్యసాయం అందిస్తా మని చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వనదేవతలకు మొక్కులు చెల్లించాలని కోరారు. జంపన్నవాగులోకి లక్నవరం నీటిని విడుదల చేశామని, వాగులో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతర ం ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ తరపున 40 వేల మంది విధుల్లో ఉంటారని చెప్పారు. ఈసారి మరింత మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గతంలో 3300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా ఈసారి 3800 ఏర్పాటు చేశామన్నారు. తొలుత అభివృద్ధి పనులను మంత్రులు దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించి పరిశీలించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.