Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్ని ఎంత జల్దీ వదిలించుకుంటే దేశానికంత మంచిది
- హిజాబ్ ఘటనపై దేశం మౌనం మంచిదికాదు
- ధర్మం, మతం పేరుతో అరాచకం చేస్తారా..?
- కార్పొరేట్ గద్దల కోసమే విద్యుత్ సంస్కరణలు
- సర్జికల్ స్ట్రైక్ సాక్ష్యాలు అడిగితే తప్పేంటి..? ొ ప్రజలు ఉద్యమించాలి
- అవసరమైతే... జాతీయ పార్టీ ప్రకటన చేస్తా...: బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్్
నవతెలంగాణ- హైదరాబాద్ బ్యూరో
బీజేపీ సిగ్గుమాలిన పార్టీ అనీ, దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ధర్మం, మతం పేరుతో ఆపార్టీ దేశంలో అరాచకాలు సృష్టించి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తుందనీ, యువత ఆ ప్రమాదాన్ని గుర్తించి ప్రతిఘటిం చాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై ఫైర్ అయ్యారు. ఆ పార్టీ విధానాలను ఎండగట్టారు. మతోన్మాద ప్రమాదాన్ని హెచ్చరించారు. బెంగుళూరు లోని ఓ విద్యాసంస్థలో ఇటీవల చోటుచేసుకున్న హిజాబ్ ఘటనపై ప్రధాని మోడీతో పాటు దేశం మౌనంగా ఉండటం మంచిదికాదన్నారు. ఇటువంటి అంతర్యుద్దాలతో దేశ సమగ్రతకు ప్రమాదమని హెచ్చరించారు. బీజేపీకి చందాలిచ్చే కార్పొరేట్ గద్దలకు విద్యుత్ రంగాన్ని కట్టబెట్టేందుకే విద్యుత్ సంస్కరణల బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై తనతో పాటు దేశ ప్రజలకు అనుమానం ఉందనీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాటిపై సాక్ష్యాలు అడిగితే తప్పు ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై బీజేపీ సీఎం చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఖండించినంత మాత్రాన ఆపార్టీ (కాంగ్రెస్)కి తాము మద్దతు ఇస్తున్నట్టు కాదని వివరణ ఇచ్చారు. విద్యుత్ సంస్కరణల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలుపకముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో వాటిని అమలు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. కేంద్రం షరతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలొగ్గిందనీ, దానిలో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో 25వేల బోర్లకు మీటర్లు బిగించారని చెప్పారు. దానికోసం ఏపీ ప్రభుత్వం రూ.735 కోట్లతో టెండర్లు కూడా పిలిచిందన్నారు. విద్యుత్ సంస్కరణలకు అంగీకరించిన ఏపీ, ఇతర రాష్ట్రాలకు ఏడాదికి అదనంగా 0.5శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్రం పెంచిందనీ, తిరస్కరించిన రాష్ట్రాలకు రుణాలు ఆపేయాలని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రీజనల్ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్ (ఆర్ఈసీ)కు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆదేశాలివ్వడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే కార్పొరేట్ కంపెనీలకు దేశ విద్యుత్ రంగాన్ని అప్పగించాలనే కుటిల లక్ష్యంతోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చారని విమర్శించారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం దేశ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారా..? అని ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల అవసరాలమేరకు ఆయా రంగాలకు విద్యుత్ సబ్సిడీలు ఇస్తే కేంద్రానికి ఏం నొప్పి అని ప్రశ్నించారు. పేదలకు విద్యుత్ సబ్సిడీలు బంద్ చేసి గజదొంగలకు సద్ది కట్టడమే విద్యుత్ బిల్లు స్వరూపమని ఘాటుగా విమర్శించారు. చైనా, సింగపూర్ దేశాల మాదిరి ఇక్కడ కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. బీజేపీని తరిమికొట్టకపోతే దేశం నాశనమవుతుందనీ, తాను అక్కసుతో ఇలా మాట్లాడటంలేదని స్పష్టత ఇచ్చారు.
బీజేపీ పాలనలో అవినీతి, అసహనం పెరిగాయనీ, దేశం మొత్తం సంపదలో 77శాతం సంపద కేవలం 10 శాతం మంది చేతిలో ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. నిరుద్యోగం, ఆకలి చావులు పెరిగాయనీ, 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయనీ, పారిశ్రామిక ఉత్పత్తి 0.4 శాతానికి పడిపోయిందని వివరించారు. మోడీ మేక్ ఇన్ ఇండియా ఫలితం ఇదేనా అని ఎద్దేవా చేశారు.
మోడీ హయాంలో బ్యాంకులను మోసం చేసిన 33 మంది దొంగలు దేశం విడిచి పారిపోయారని, వారిలో చాలామంది మోడీ దోస్తులేనని సీఎం కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫేల్ గోల్మాల్ వ్యవహారం బైటపెడితే బీజేపీ రాద్ధాంతం చేసిందనీ, ఇప్పుడు తాను దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని చెప్పారు. మోడీ ప్రభుత్వం 36 రఫేల్ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తే, ఇటీవల ఇండోనేషియా 42 రఫేల్ విమానాలను 8 బిలియన్ డాలర్లకే కొనుగోలు చేసిందనీ, ఇప్పుడు దొంగలెవరో తేలుతుందన్నారు. లంగలు, దొంగలకు కేసులంటే భయమనీ, తనకు అలాంటి భయాలేం లేవని అన్నారు. ''కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ పేర్లు చెప్పి ఆగమాగం చేస్తారా..నా దగ్గరా లెక్కలున్నాయి. బీజేపీ వాళ్లని వదిలేది లేదు'' అని హెచ్చరించారు. బీజేపీకి సిగ్గూ, సంస్కారం లేవనీ, ఎన్నికల్లో గెలవకున్నా పాలన చేసే అప్రజాస్వామిక పార్టీ అని విమర్శించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్‌లో మెజారిటీ లేకపోయినా ప్రభుత్వాలు నడుపుతున్నారనీ, దేశాన్ని పాలించేవాళ్ల పద్దతి ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోగానే మళ్లీ పెట్రోల్ ధరలు పెంచుతారని చెప్పారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేసి దేశం పరువు తీసారని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదని అన్నారు.
కొత్త రాజ్యాంగం అవసరమని తాను చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇచ్చారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ రిజర్వేషన్లు పెంచేందుకు, మహిళలకు రక్షణ, సమాన హక్కుల సాధనకు, దేశ సంపద అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశ్యంతోనే తాను కొత్త రాజ్యాగం ప్రతిపాదన చేసానని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రగతిశీలంగా ఉండాలని డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ చెప్పారనీ, ఆ స్ఫూర్తి దేశ పాలకుల్లో లేదన్నారు. దీనిపై దళిత సంఘాలు ఎందుకు స్పందిస్తున్నాయని ప్రశ్నించారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగమవుతున్నదనీ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సహనంతో ఉండాలని సూచించారు. జాతీయ ప్రయోజనాల కోసం అవసరమైతే జాతీయ పార్టీ ప్రకటిస్తానని చెప్పారు.