Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పస్రా-మేడారం రహదారిలో నాసిరకం పనులు
- అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ములుగు జిల్లాలోని మేడారం మహాజాతర సందర్భంగా చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపం డొల్లతనం బయటపడింది. పస్రా టూ మేడారం రహదారి నిర్మాణం మరమ్మతు పనులకు రూ.10 కోట్లను మంజూరు చేశారు. ఈ పనులను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి చేజిక్కించుకొని పలువురు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించారు. అయితే ఈ ప్యాచ్ పనులను ముగించిన కాంట్రాక్టర్లు రహదారికి ఇరువైపులా పోయాల్సిన సైడ్ బర్మ్స్ను నాసిరకపు మట్టి, దుమ్ము, ఇసుకతో నింపి చేతులు దులుపుకున్నారు. మేడారం జాతర ప్రారంభంకాక మునుపే రహదారికి ఇరువైపుల ఉన్న సైడ్బర్మ్స్ కుంగిపోతున్న దుస్థితి నెలకొంది. ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు.
మేడారం జాతరకు సంబందించిన పలు పనులకుగాను రహదారులు, భవనాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా పస్రా నుంచి మేడారం పోయే రహదారిలో ప్యాచ్ వర్క్ చేయడానికి రూ.10 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పస్రా నుంచి నార్లాపూర్ మధ్య రోడ్డు డ్యామేజీ పనులు చేయడంతో పాటు రహదారికిరువైపులా సైడ్ బర్మ్స్ పోయాల్సి ఉంది. ఇప్పటికే ఈ పనులను గుత్తేదారులు పూర్తి చేశారు. కాగా, పలుచోట్ల కల్వర్టుల వద్ద మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా చేయకుండా నాసిరకం మట్టి పోసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. ఇదే రహదారిలో చింతల్ క్రాసు, ఎలుబాకా, పగిడాపూర్ గ్రామాల వద్ద రోడ్డు డ్యామేజీలకు మరమ్మతులు చేయలేదు. దాంతో సైడ్బర్మ్స్ కుంగిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదే రహదారిలో ప్రాజెక్టునగర్ వద్ద సైడ్బర్మ్స్ కేవలం ఇసుక, దుమ్ముతో నింపడం ఈ రహదారి నాణ్యత ప్రమాణాల డొల్లతనాన్ని బహిర్గతం చేస్తుంది.
వాహనాలకు పొంచి ఉన్న ప్రమాదం
జాతర ప్రారంభం కాకముందే మేడానికి సందర్శకుల తాకిడి పెరగడంతో పస్రా నుంచి మేడారం వెళ్లే రహదారిలో ప్రయివేటు వాహనాల రద్దీ పెరిగింది. గ్రామ సమీపంలో రహదారికి ఇరువైపులా నాసిరకపు మట్టితో సైడ్బర్మ్స్ పోయడం, పలు కల్వర్టుల వద్ద సైడ్బర్మ్స్ నింపకపోవడంతో వాహనాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రతి జాతరకు ఆరు నెలల ముందే పనులు ప్రారంభించాలని మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు సాధ్యమైనంత మేరకు ఆలస్యంగానే పనులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఉద్దేశ్యపూర్వకంగానే పనులను ఆలస్యంగా చేపట్టడం ఆనవాయితీగా మారింది.
అధికార టీఆర్ఎస్ నేతల హల్చల్
మేడారం జాతరలో ప్రతిసారీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కాంట్రాక్టర్లు ఆర్ అండ్ బీ పనులను దక్కించుకొని నాణ్యతా ప్రమాణాలను విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జంపన్నవాగు నుంచి మేడారం వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.50 లక్షలు కేటాయించారు. ఈ పనులు కూడా అత్యంత నాసిరకంగా నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా ఇష్టం వచ్చినట్లు నిర్మాణం పూర్తి చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. మొట్లగూడెం వద్ద కల్వర్టుపై స్లాబ్ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారు. ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు నివేదిక ఇవ్వకముందే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల విలువ చేసే రోడ్డు నిర్మాణంపై ఆర్ అండ్ బీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు సరిగ్గా పర్యవేక్షించకుండా అధికార టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో తలొగ్గి బిల్లులు ఇచ్చేసి ఎవరి కమిషన్లు వారు దండుకున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.