Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామానుజుల విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమాజంలో ప్రజల మధ్య సామాజిక అసమానతలు ఉండరాదని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు. ముచ్చింతల్‌లో చినజీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆదివారంనాడాయన సతీసమేతంగా సందర్శించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన సమతాస్ఫూర్తి కేంద్రంలోని 108 ఆలయాల మండపంలో కలియతిరిగారు. వందేండ్ల క్రితమే దేశంలో సామాజిక అసమానతలను నిరసించి, అందరికీ దేవాలయ ప్రవేశాన్ని రామానుజులు కాంక్షించారని చెప్పారు. ఆయన బోధించిన విశిష్ట అద్వైత సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రజల్లో సజీవంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్యుల 120 ఏండ్ల జీవితానికి గుర్తుగా భద్రవేదిలోని మొదటి అంతస్తులో 120 కిలోల బంగారంతో చేసిన రామానుజుల విగ్రహాన్ని రాష్ట్రపతి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను చినజీయర్ స్వామి రాష్ట్రపతికి వివరించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మై హౌం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.